Telugu Global
Telangana

హైదరాబాద్‌లో యూఏఈ కాన్సులేట్.. జూన్ 14న ప్రారంభం

యూఏఈ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి అహ్మద్ అలీ అల్ సాయేఘ్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

హైదరాబాద్‌లో యూఏఈ కాన్సులేట్.. జూన్ 14న ప్రారంభం
X

హైదరాబాద్ నగరానికి మరో కాన్సులేట్ రాబోతున్నది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) హైదరాబాద్‌లో కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నది. జూన్ 14 నుంచి ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు హైదరాబాద్‌లో యూఏఈ కాన్సుల్ జనరల్ ఆరెఫ్ అల్‌నుయైమీ తెలిపారు. యూఏఈ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి అహ్మద్ అలీ అల్ సాయేఘ్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

ఢిల్లీలో యూఏఈ ఎంబసీ ఉండగా.. ముంబై, తిరువునంతపురంలో కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు ఉన్నాయి. దక్షిణాదితో పాటు తూర్పు కోస్తా రాష్ట్రాల వాసులు ఎక్కువగా యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జాలకు ఉపాధి, ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ, తమిళనాడు, ఒడిషా, జార్ఖండ్ నుంచి అత్యధికంగా యూఏఈ వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీరు వీసా కోసం తిరువునంతపురం, ముంబై లేదా ఢిల్లీ వరకు వెళ్లాల్సి వస్తోంది. అందుకే కొత్తగా హైదరాబాద్‌లో కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు యూఏఈ అధికారులు చెప్పారు. ఇకపై వీసాల కోసం చాలా దూరం ప్రయాణం చేయనక్కరలేదని పేర్కొన్నారు.

బంజారాహిల్స్‌లో కొత్త కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఏప్రిల్ నుంచే పరిమితంగా కార్యకలాపాలు సాగిస్తున్నది. 8200 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కార్యాలయాన్ని జూన్ 14న అధికారికంగా యూఏపీ ప్రభుత్వం ప్రారంభించనున్నది. మొదట్లో రోజుకు 200 వీసా అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు కాన్సులేట్ జనరల్ ఆరెఫ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను 500కు పెంచుతామని.. డిమాండ్‌ను బట్టి 700-800 వరకు వీసాలు ప్రాసెస్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

యూఏఈ వీసాలకు హైదరాబాద్, తెలంగాణలోనే కాకుండా దక్షిణాదిలో చాలా డిమాండ్ ఉన్నది. అందుకే ఇక్కడ కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు అల్‌నుయైమీ తెలిపారు. ప్రస్తుతం తిరువునంతపురం కాన్సులేట్ కార్యాలయంలో అత్యధిక వీసాలు తెలంగాణ వాసులకు చెందినవే ఉంటున్నాయని ఆయన చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు.

యూఏఈకి భారత్‌తో వ్యాపార, వాణిజ్య, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. పశ్చిమాసియాలో భారతీయులు అత్యధికంగా ఉన్న దేశం యూఏఈనే. భారత్-యూఏఈ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువు దాదాపు 60 బిలియన్ డాలర్లుగా ఉన్నది. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో యూఏఈ వాటా 8 శాతంగా ఉంది. మరోవైపు హైదరాబాద్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం యూఏఈ నుంచి పేషెంట్లు వస్తుంటారు. విద్య, వైద్యం కోసం యూఏఈ నుంచి ఇండియాకు వచ్చే వాళ్లు.. ఎక్కువగా హైదరాబాద్‌నే ఎంచుకుంటున్న కాన్సులేట్ జనరల్ అల్‌నుయైమీ తెలిపారు.

First Published:  25 May 2023 6:58 AM IST
Next Story