తెలంగాణలో మరో ఘనత.. తొలిసారి ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు
ప్రాచీ రాథోడ్, రూత్ జాన్ పాల్ కొయ్యాల అనే ఇద్దరు ట్రాన్స్ జెండర్లు వైద్య విద్యను పూర్తి చేసి ఉద్యోగాలకోసం ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వైద్యులుగా చేరేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. అయితే ఈ ఇద్దరు డాక్టర్లు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి చరిత్ర సృష్టించారు.
అన్నిరంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం సామాజిక కోణంలో కూడా తనదైన ముద్ర వేస్తోంది. సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్న వైద్యులైన ఇద్దరు ట్రాన్స్ జెండర్ల కు తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ఉద్యోగాలు కల్పిస్తూ చరిత్ర లిఖించింది. దేశంలో ఇప్పటివరకూ ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తులలో స్త్రీ, పురుష అనే కాలమ్ మాత్రమే ఉంటుండేది. దాంతో మూడవ కేటగిరికి చెందిన ట్రాన్స్ జెండర్లకు అవకాశాలు పెద్దగా వచ్చేవి కావు. అయితే ఇతర రాష్ట్రాలలో వీరు రాజకీయాల్లో ప్రవేశించి తమను తాము నిరూపించుకున్న దాఖలాలు ఉన్నాయి. కానీ ఉద్యోగాల విషయానికి వచ్చేరికి నిరాశే ఎదురయ్యేది.
ప్రాచీ రాథోడ్, రూత్ జాన్ పాల్ కొయ్యాల అనే ఇద్దరు ట్రాన్స్ జెండర్లు వైద్య విద్యను పూర్తి చేసి వైద్యులుగా చేరేందుకు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ కష్టాలు పడ్డారు. అయితే ట్రాన్స్ జెండర్లు అయిన ఈ ఇద్దరు డాక్టర్లు ప్రాచీ రాథోడ్, రూత్ జాన్ పాల్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి చరిత్ర సృష్టించారు. వాళ్లిద్దరూ ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్స్ గా నియమితులయ్యారు. అయితే ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కడానికి ముందు చాలానే కష్టపడాల్సి వచ్చింది.
2018లో ఎంబీబీఎస్ పూర్తి చేసినా కూడా తనను డాక్టర్ గా తీసుకోవడానికి హైదరాబాద్ లోని 15 ఆస్పత్రులు తిరస్కరించాయని డాక్టర్ రూత్ జాన్ పాల్ చెప్పింది. అలాగే మరో ట్రాన్స్ జెండర్ డాక్టర్ ప్రాచీ రాథోడ్ కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. తాను ఆదిలాబాద్ రిమ్స్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ట్రాన్స్ జెండర్ అని ప్రైవేటు ఆస్పత్రిలో ఉద్యోగంలోంచి తీసేశారని.. నాలాంటి వారు ఉంటే ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య తగ్గిపోతుందని తిరస్కరించారని ప్రాచీ తెలిపింది. రెండేళ్లుగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నామని.. వ్యక్తిగత సమస్యలతోపాటు సామాజిక వివక్ష కూడా ఎదుర్కొన్నామన్నారు.
అయితే తెలంగాణ ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పించింది. తాము ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్స్ గా నియమితులవ్వడంతో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి చారిత్రక విజయం అని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినందుకు తాము చాలా గర్వపడుతున్నామన్నారు. తమకు ప్రభుత్వ ఉద్యోగం రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెబుతున్నారు.