Telugu Global
Telangana

యూఎన్ హెరిటేజ్ గుర్తింపు కోసం.. తెలంగాణ నుంచి మరో రెండు రాతి నిర్మాణాలు

800 ఏళ్ల చరిత్ర కలగిన రామప్ప దేవాలయ కట్టడాన్ని రక్షించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.

యూఎన్ హెరిటేజ్ గుర్తింపు కోసం.. తెలంగాణ నుంచి మరో రెండు రాతి నిర్మాణాలు
X

తెలంగాణలోని రామప్ప దేవాలయానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపునిచ్చింది. 800 ఏళ్ల చరిత్ర కలగిన రామప్ప దేవాలయ కట్టడాన్ని రక్షించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా తెలంగాణ నుంచి మరో రెండు కట్టడాలను నిర్మాణపరంగా అద్భుతమైనవిగా గుర్తించే పనిలో ఉన్నారు. రాష్ట్ర ఆర్కియాలజీ శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)కు గత నెలలోనే పంపించింది.

తెలంగాణలో 3,500 ఏళ్లకు పూర్వం నాటి 'నిలువు రాళ్లు'గా పిలవబడే ప్రదేశంతో పాటు.. 11వ శతాబ్దానికి చెందిన చాయా సోమేశ్వరాలయాన్ని యునెస్కో హెరిటేజ్ సైట్లుగా గుర్తించాలని ప్రతిపాదనలు పంపింది. నిలువురాళ్ల సైట్ నారాయణపేట్ జిల్లాలో ఉండగా.. ఇక్ష్వాకుల పాలనలో నిర్మించిన సోమేశ్వరాలయం నల్గొండ జిల్లాలోని పానగల్ గ్రామంలో ఉన్నది. ఈ రెండు రాతి నిర్మాణాలకు ఏఎస్ఐ, యునెస్కో నుంచి ప్రాథమిక గుర్తింపు లభిస్తే.. ఆ తర్వాత పూర్తి స్థాయి రిపోర్టును రాష్ట్ర ఆర్కియాలజీ విభాగం పంపే అవకాశం ఉంది.

ఈ రెండు నిర్మాణాలకు సంబంధించిన రక్షణ ప్రణాళిక, పూర్తి వివరాల డాక్యుమెంట్లు, ఇతర వివరాలు యునెస్కోకు పంపితే.. అప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించే అవకాశం ఉంటుందని ఆర్కియాలజీ శాఖ అధికారి ఒకరు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 12కు పైగా సైట్లను వారసత్వ సంపదగా గుర్తించమని లేఖలు రాసింది. అందులో గోల్కొండ కోట కూడా ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఏఎస్ఐ దీనిపై ఇంత వరకు స్పందించలేదు. పైగా వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించడానికి తగిన అర్హతలు లేవని చెబుతోంది.

వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించాలంటే.. సదరు నిర్మాణం ఆక్రమణలకు గురి కావొద్దు. దాని చుట్టు పక్కల మరే ఇతర నిర్మాణాలు ఉండకూడదు. ఈ నిబంధనను సాకుగా చూపి గోల్కొండ కోటను వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా ప్రతిపాదించడం లేదు.

ఇక నారాయణపేట జిల్లా ముద్మల్‌లో ఉన్న 'నిలువురాళ్ల' ప్రదేశం ఐదు ఎకరాల్లో విస్తరించి ఉన్నది. దాని చుట్టు పక్కల వేలాది రాళ్లు 50 ఎకరాల పరిధిలో ఉన్నాయి. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశాన్ని అక్కడ గ్రామస్తులు చాలా గౌరవంగా చూస్తుంటారు. పెద్ద రాళ్లు సగటున 10 నుంచి 14 అడుగల ఎత్తు ఉంటాయి. ఇక చిన్న రాళ్లు 5 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. ఈ రాళ్లను తిమ్మప్ప, ఎల్లమ్మగా స్థానికులు కొలుస్తుంటారు. ఎన్నో శతాబ్దాలుగా ఈ రాళ్లు ఇక్కడ ఉన్నా.. స్థానికుల వల్ల ఎలాంటి డ్యామేజ్ జరగలేదని పరిశోధకులు చెబుతున్నారు.

ఇక నల్గొండ జిల్లాలోని చాయా సోమేశ్వరాలయం చానాళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. పరిశోధకులు, స్థానికుల డిమాండ్ మేరకు 2000వ సంవత్సరంలో దీని రక్షణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకున్నది. గర్భగుడిలోని శివలింగంపై నీడ ఎక్కడి నుంచి పడుతుందో ఇంత వరకు పరిశోధకులు వివరించలేక పోయారు. అందుకే చాయా సోమేశ్వరాలయంగా పిలుస్తున్నారు. ఈ రెండు అద్భుతమైన ప్రదేశాలను ఇప్పుడు యూఎన్ హెరిటేజ్ సైట్లుగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.

First Published:  6 May 2023 8:16 AM IST
Next Story