రాజాసింగ్‌పై మరో రెండు కేసులు.. ఈ సారి ఎందుకంటే!
తుపాకులు, కత్తులు పెట్టి రాజాసింగ్ ఆయుధ పూజ చేశారు. దానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌పై పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. ఎప్పుడూ వివాదాల్లో ఉండే రాజాసింగ్.. ఈ సారి దాండియా నేపథ్యంలో చేసిన ప్రసంగంలో మాట్లాడిన మాటలపై ఒక కేసు నమోదు కాగా.. దసరా సందర్భంగా చేసిన ఆయుధ పూజకు సంబంధించి మరో కేసు పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దసరా సందర్భంగా ఆయుధ పూజ సమయంలో నిషేధిత ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించినందుకు పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
తుపాకులు, కత్తులు పెట్టి రాజాసింగ్ ఆయుధ పూజ చేశారు. దానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. దీనిపై పోలీసులు నోటీసులు జారీ చేసి, వారం రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మరోవైపు దాండియా ఈవెంట్‌కు ముస్లింలను పిలవొద్దంటూ మంగళ్‌హాట్‌కు చెందిన ఈవెంట్ నిర్వాహకులను రాజాసింగ్ బెదిరించారు.
నవరాత్రి ఉత్సవాలకు వచ్చే వారందరి గుర్తింపు కార్డులు తనిఖీ చేయాలని.. ముస్లిం బౌన్సర్లు, డీజే ఆర్టిస్టులు, ఇతర పనులకు వారిని పిలవొద్దని.. అలా చేస్తే దాడులు చేస్తామంటూ రాజాసింగ్ విద్వేషపూర్తిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. దీనిపై స్థానిక ముస్లిం నాయకుడు సమద్ మంగళ్‌హాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 153ఏ, 295ఏ (ఆర్మ్స్ యాక్ట్), 504 సెక్షన్ల కింద ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు.
రాజాసింగ్‌పై ఇప్పటికే పీడీ యాక్ట్ నమోదు అయ్యి ఉంది. పలు షరతులతో ఆయనకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయినా సరే విద్వేషపూరిత ప్రసంగాలు ఆపడం లేదు. మంగళ్‌హాట్ పోలీసులు కనుక రాజాసింగ్‌పై హైకోర్టుకు నివేదిక ఇస్తే అతడి బెయిల్ క్యాన్సిల్ అవడం ఖాయమే. కాగా, ఆయుధ పూజ సందర్భంగా ప్రదర్శించిన గన్స్ ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందివని.. అలా ప్రదర్శించడం నిషేధమని పోలీసులు అంటున్నారు.