Telugu Global
Telangana

హైదరాబాద్ లో కుండపోత.. ఈరోజు, రేపు ద్రోణి ప్రభావం

ఈరోజు రేపు కూడా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్‌, హన్మకొండ, మెదక్, హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి.

హైదరాబాద్ లో కుండపోత.. ఈరోజు, రేపు ద్రోణి ప్రభావం
X

ఉక్కపోత తప్పి కుండపోత మొదలైంది. హైదరాబాద్ లో రాత్రి రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. రెండు గంటల సేపు వర్షం దంచి కొట్టింది. కొన్ని ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రామచంద్రాపురం, గచ్చిబౌలి, గాజులరామారం, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. హైదరాబాద్ కి భారీ వర్షాలు కొత్త కాకపోయినా, వేసవిలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు. 2015 వేసవిలో 6.1 సెంటీమీటర్ల అత్యథిక వర్షపాతం నమోదు కాగా, ఈ ఏడాది వేసవి ఆ రికార్డ్ బ్రేక్ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా తగ్గిన ఉష్ణోగ్రతలు..

తెలంగాణ వ్యాప్తంగా నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు రేపు కూడా వాతావరణం చల్లగా ఉంటుందని, వర్షాలు కురిసే అవకాశముందని తెలుస్తోంది. మహారాష్ట్ర మీదుగా దక్షిణ కర్నాటక వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. ఈరోజు రేపు కూడా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్‌, హన్మకొండ, మెదక్, హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి.

రెండు రోజులు అప్రమత్తం..

ఈరోజు రేపు కూడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణం ప్రశాంతంగానే ఉన్నా.. ఉన్నట్టుండి మార్పులు రావొచ్చని, ఒక్కసారిగా కుండపోత మొదలవుతుందని తెలిపారు అధికారులు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గడంతో తెలంగాణ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అకాల వర్షాలు రైతన్నలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. చేతికి అందివచ్చిన పంట నేలపాలవడంతో రైతులు విలవిల్లాడుతున్నారు.

First Published:  26 April 2023 8:08 AM IST
Next Story