రెండు దేశాలు.. 42000 ఉద్యోగాలు.. ముగిసిన మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన
రెండు వారాల్లో అమెరికా, యూకేల్లో మంత్రి కేటీఆర్ చేసిన పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించి.. కొత్త పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటుకు అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు, కొత్త సంస్థలు, యువతకు ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రెండు దేశాల్లో పర్యటించారు. తొలుత యూకేలో పర్యటించిన మంత్రి.. ఫాక్స్‌కాన్ సంస్థ శంకుస్థాపన కార్యక్రమం కోసం హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఆ వెంటనే అమెరికాకు బయలుదేరి వెళ్లారు. గత రెండు వారాల్లో అమెరికా, యూకేల్లో మంత్రి కేటీఆర్ చేసిన పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించి.. కొత్త పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటుకు అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీని వల్ల యువతకు 42 వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా లభించనున్నాయి.
మంత్రి కేటీఆర్, రాష్ట్ర అధికారులతో కూడిన బృందం యూకే పర్యటనలో భాగంగా లండన్.. అమెరికా పర్యటనలో న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, హ్యూస్టన్, హెండర్సన్, బూస్టన్ వంటి నగరాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా 80కి పైగా బిజినెస్ సమావేశాలు, పలు అంశాలపై నిర్వహించిన 5 రౌండ్ టేబుల్ సమావేశాలు, రెండు అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్లుగా సాధించిన విజయాలు, ఇక్కడ పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను ప్రపంచానికి చాటి చెప్పారు.
కేటీఆర్ పర్యటన వల్ల కీలకమైన 10 రంగాల్లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఐటీ, ఐటీఈఎస్, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఏరో స్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్, మెడికల్ డివైజెస్, డిజిటల్ సొల్యూషన్స్, ఇన్నోవేషన్, డాటా సెంటర్, ఆటోమోటీవ్ అండ్ ఈవీ, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్స్యూరెన్స్) రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడంలో విజయం సాధించారు.
ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించే లక్ష్యంతో నల్గొండ, కరీంనగర్ వంటి ప్రాంతాలకు కూడా కొత్త సంస్థలు వచ్చేలా కృషి చేశారు. యూకే, అమెరికాల్లోని దిగ్గజ ఐటీ, ఐటీఈఎస్‌తో పాటు ఇతర రంగాల యాజమాన్యాలతో భేటీ అయ్యారు. పలు ఐటీ కంపెనీలకు చెందిన 30 మంది ఎన్ఆర్ఐ సీఈవోలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్, నల్గొండలో పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 3ఎం-ఈసీఎల్ఏటీ అనే సంస్థ కరీంనగర్‌లో, సొనాటా సాఫ్ట్‌వేర్ నల్గొండ ఐటీ టవర్‌లో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ప్రకటించాయి. వరంగల్‌లో రైట్ సాఫ్ట్‌వేర్ కూడా పెట్టుబడులు పెడతామని స్పష్టం చేసింది.
రెండు దేశాల పర్యటనల్లో ఐదు రౌండ్ టేబుల్ సమావేశాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్న అవకాశాలు, సాధించిన ప్రగతిని సమగ్రంగా విశ్లేషించారు. లండన్‌లోని భారత హైకమిషనర్ ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని తెలియ జేశారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన ఆర్థికాభివృద్ధి, ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు, హైదరాబాద్‌లోని ఆవిష్కరణల ఎకో సిస్టమ్‌ను వివరించారు.
న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఇండియాలో పెట్టుబడులకు తెలంగాణ గేట్‌వేగా ఎలా మారిందో వివరించారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంపై నిర్వమించిన సమావేశంలో రాష్ట్రం నమోదు చేసిన గణనీయమైన వృద్ధిని తెలియజేశారు. విద్య, వైద్య రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలను వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విజయం..
ఈ నెల 12న లండన్‌లో నిర్వహించిన సదస్సులో కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల గురించి వివరించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు కేంద్రంలోని ప్రభుత్వం కూడా చేపట్టి అమలు చేస్తున్న విషయాన్ని వివరించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్‌గా ఎలా మారిందో తెలిపారు. ఇక అమెరికాలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో కాళేశ్వరం ప్రాజెక్టు సాధించిన విజయాలను వివరించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ పంపుల ద్వారా మంచి నీటి సరఫరాను చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని కేంద్రం కూడా అమలు చేస్తున్న విషయాన్ని వివరించారు. మంత్రి కేటీఆర్ రెండు వారాల పర్యటన పూర్తిగా విజయవంతంగా ముగించుకున్నారు. మంత్రితో పాటు తెలంగాణ ప్రతినిధి బృందంలో ఐటీ, పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇతర అధికారులు విష్ణువర్థన్ రెడ్డి, దిలీప్ కొణతం, శక్తి ఎం నాగప్పన్, ప్రవీణ్, అమర్‌నాథ్ రెడ్డి, వెంకటశేఖర్ తదితరులు ఉన్నారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న కొన్ని దిగ్గజ కంపెనీలు..
- వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ. (మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్)
- మెడ్ ట్రానిక్స్ (హెల్త్‌కేర్)
- స్టేట్ స్ట్రీట్ (అసెట్ మేనేజ్‌మెంట్)
- వీఎక్స్ఐ గ్లోబల్ (కన్జ్యూమర్ కేర్)
- లండన్ స్టాక్ ఎక్చేంజ్ గ్రూప్ (ఫైనాన్స్)
- డీఏజెడ్ఎన్‌సీ (స్ట్రీమింగ్ కంపెనీ)
- టెక్‌నిప్ ఎఫ్ఎంసీ (ఆయిల్ అండ్ గ్యాస్)
- ఏలియంట్ గ్రూప్ (ఫైనాన్స్ సర్వీసెస్)
- స్టెమ్ క్యూర్స్ (లైఫ్ సైన్సెస్)
- మోండీ (టెక్నాలజీ ఇన్నోవేషన్)
- జాప్‌కాప్ (ఇంజనీరింగ్ సొల్యూషన్స్)
A successful and extremely productive business trip to the UK and the US comes to an end!
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 25, 2023
✅ 2 Weeks
✅ 2 Countries
✅ 80+ Business Meetings
✅ 5 Round Table Meetings
✅ 2 Conferences
✅ Huge Investments across 10 Sectors
✅ Will Create over 42,000 Direct Jobs
✅ Expansion of… pic.twitter.com/8bzxc804PR
తెలంగాణకు పెట్టుబడులు తెచ్చి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి @KTRBRS చేపట్టిన ఇంగ్లాండ్, అమెరికా దేశాల పర్యటన విజయవంతంగా ముగిసింది. తెలంగాణలో ప్రతిష్టాత్మక కంపెనీల భారీ పెట్టుబడులు - 42,000 మందికి ఉద్యోగావకాశాలు.#InvestTelangana pic.twitter.com/1mXmHGGmZZ
— Telangana Digital Media Wing (@DigitalMediaTS) May 25, 2023