Telugu Global
Telangana

చెరువు మాయమంటూ కేటీఆర్‌కు ట్వీట్.. తీరా వెళ్లి చూస్తే..

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో భారీ భవనాలు నిర్మించేందుకు సెల్లార్ తవ్వారు. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ రద్దయింది.

చెరువు మాయమంటూ కేటీఆర్‌కు ట్వీట్.. తీరా వెళ్లి చూస్తే..
X

మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో వచ్చిన ఒక ఫిర్యాదు అధికారులను పరుగులు పెట్టించింది. తీరా అక్కడికి వెళ్లి చూసిన తర్వాత అధికారులే అవాక్కయ్యారు. చెరువుకు, సెల్లార్‌ గుంతకు తేడా తెలుసుకోలేక కేటీఆర్‌కు ఫిర్యాదు చేసినట్టు అధికారులు నిర్ధారించారు. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీలోని లోథా టవర్స్‌ వద్ద ఆరు నెలల క్రితం వరకు చెరువు ఉండేదని.. తాము అక్కడికి పక్షుల కిలకిల రాగాలు వినేందుకు వెళ్లేవారమ‌ని.. ఇప్పుడది మాయం అయ్యిందంటూ ఫ్యూచర్ ఫౌండేషన్‌ సొసైటీ ప్రతినిధులు కొన్ని గూగుల్ మ్యాప్‌ చిత్రాలను జోడించి మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు.

దానిపై స్పందించిన కేటీఆర్‌.. నిజంగానే చెరువు మాయమై ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో మాయమైన చెరువు ఎక్కడుందా అని తెలుసుకునేందుకు అధికారులు వెళ్లారు. అసలు ఆ ప్రాంతంలో ఇది వరకు కూడా చెరువే లేదని స్థానికులు వివరించారు. దాంతో అధికారులు నిశితంగా పరిశీలన చేశారు. చివరకు సొసైటీ ప్రతినిధులు జత చేసిన ఫొటో చెరువుకు సంబంధించినది కాదని తేల్చారు. అదో సెల్లార్‌ గుంత.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో భారీ భవనాలు నిర్మించేందుకు సెల్లార్ తవ్వారు. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ రద్దయింది. వర్షకాలం భారీగా నీరు వచ్చి చేరేది. పిల్లలు ఆడుకోవడానికి వెళ్లి ఆ నీటిలో పడి మృతిచెందిన ఉదంతాలు ఉన్నాయి. దాంతో అధికారులు ఆ సెల్లార్‌ గుంతను మట్టితో పూడ్చేశారు. గతంలో వర్షకాలం నీరు నిలిచిన సమయంలో తీసిన సెల్లార్‌ గుంత ఫొటోలను సొసైటీ ప్రతినిధులు చెరువుగా భావించి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.

First Published:  5 Dec 2022 4:57 PM IST
Next Story