Telugu Global
Telangana

తుమ్మలకు దిక్కుతోచటం లేదా?

బీజేపీ, కాంగ్రెస్ నుండి తుమ్మలకు ఆఫర్లు వస్తున్నాయి. దాంతో టీఆర్ఎస్‌లోనే కంటిన్యూ అవ్వాలా? లేకపోతే ఏదో పార్టీలో చేరాలా అన్నదే తేల్చుకోలేకపోతున్నారు.

తుమ్మలకు దిక్కుతోచటం లేదా?
X

ఒక‌ప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు ఒక వెలుగు వెలిగారు. ముఖ్యమంత్రిగా ఎవరున్నారనే విషయంతో సంబంధం లేకుండా కంటితోనే మొత్తం ఖమ్మం జిల్లాను శాసించారు. దాదాపు మూడు దశాబ్దాలు టీడీపీ నేతగా తుమ్మల హవా జిల్లాలోనే కాకుండా యావత్ తెలంగాణలో బ్రహ్మాండంగా నడిచింది. అయితే ఇదంతా ఒక్కసారిగా చరిత్రగా మారిపోయిందా? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే తుమ్మల ఇప్పుడు బాగా గడ్డు రోజులను ఎదుర్కొంటున్నారు.

నియోజకవర్గాల పునర్విభజన కారణంగా సత్తుపల్లి నుండి ఖమ్మంకు మారిన తుమ్మల 2009లో గెలిచారు. తర్వాత 2014లో ఖమ్మంలో ఓడిపోయిన తర్వాత కేసీఆర్‌ స్వయంగా కలిసి తుమ్మలను టీఆర్ఎస్‌లో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చారు. 2016లో పాలేరులో జరిగిన ఉపఎన్నికలో గెలిచారు. అయితే 2018లో పాలేరులో కాంగ్రెస్ అభ్యర్ధి ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుండి సమస్యలు మొదలయ్యాయి.

అప్పటివరకు తుమ్మలకు బాగా ప్రాధాన్యత ఇచ్చిన కేసీఆర్‌ ఒక్కసారిగా దూరం పెట్టేశారు. దాంతో మంత్రివర్గంలో చోటు కోల్పోవటం, చట్టసభల్లో అవకాశం కూడా దక్కలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేందర్ టీఆర్ఎస్‌లో చేరారు. దాంతో తుమ్మల పరిస్దితి మరీ అన్యాయమైపోయింది. ఇప్పుడు పరిస్ధితి ఏమిటంటే తుమ్మలను పార్టీలో ఎవరూ పట్టించుకోవటంలేదు. పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా ఆయన మాట ఎక్కడా చెల్లుబాటు కావటంలేదు. ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ నుండి తుమ్మలకు ఆఫర్లు వస్తున్నాయి. దాంతో టీఆర్ఎస్‌లోనే కంటిన్యూ అవ్వాలా? లేకపోతే ఏదో పార్టీలో చేరాలా అన్నదే తేల్చుకోలేకపోతున్నారు.

టీఆర్ఎస్‌లోనే కంటిన్యూ అయితే వామపక్షాలతో పొత్తు కారణంగా టికెట్ దక్కే అవకాశం లేదు. అదే బీజేపీ లేదా కాంగ్రెస్‌లో చేరితే ఎక్కడో చోట టికెట్ గ్యారెంటీ. అయితే గెలుపు అవకాశాలు ఎంతున్నాయన్నదే సమస్య. బీజేపీ అయితే గెలుపు కష్టమనే చెప్పాలి. కాంగ్రెస్‌లో అయితే కొంతవరకు గెలుపు మీద ఆశలు పెట్టుకోవచ్చు.

ఈ విషయమై నిర్ణయం తీసుకునేందుకే ఈ మధ్యనే వాజేడులో మద్దతుదారులతో సమావేశం పెట్టుకుంటే చివరకు అది కాస్త తుస్సుమన్నది. ఒకవైపు ఎన్నికలు వచ్చేస్తున్నాయి. మరోవైపు మద్దతుదారుల నుండి ఒత్తిడి పెరిగిపోతోంది. ఇంకోవైపు నుండి పై రెండు పార్టీల నుండి ఒత్తిడి ఎక్కువైపోతోంది. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో తుమ్మలకు దిక్కుతోచటం లేదని సమాచారం.

First Published:  23 Nov 2022 11:31 AM IST
Next Story