Telugu Global
Telangana

ఎన్నికల బరిలో ఉంటా.. నా సత్తా చూపిస్తా..!

హైదరాబాద్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో ఖమ్మం చేరుకున్న తుమ్మలకు నాయకన్ గూడెం దగ్గర అభిమానులు ఘన స్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు నుంచి సుమారు వెయ్యి కార్లు, రెండు వేల బైక్‌లతో ఖమ్మం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఎన్నికల బరిలో ఉంటా.. నా సత్తా చూపిస్తా..!
X

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తన రాజకీయ భవిష్యత్‌పై సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం జీవితం అంకితం చేశానన్న తుమ్మల భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఎన్నికలు రాజకీయ పదవి కోసం కాదు జిల్లా ప్రజల కోసమేనని ప్రకటించారు. గోదావరి జలాలతో మీ పాదాలు కడిగేందుకు ఎమ్మెల్యేగా గెలిచి వస్తానన్నారు తుమ్మ‌ల‌.

కొందరు పరాన్న భుక్కులు తాత్కాలికంగా ఎత్తులు వేయోచ్చని.. జీవితంలో ఇలాంటి ఆటుపోట్లు ఎన్నో చూశానన్నారు తుమ్మల. ఎందరో నాయకుల వల్ల కానివి.. తానూ చేసి చూపించానన్నారు. ఎన్నికల్లో తప్పించామని కొందరు తాత్కాలికంగా ఆనందపడొచ్చని.. ఇప్పుడు తాను ఎవరినీ నిందించాలనుకోవడం లేదన్నారు. ఇక తన రాజకీయ జీవితం మీ చేతుల్లోనే ఉందంటూ అక్కడి కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా.. మీతో శభాష్‌ అనిపించుకుంటా.. తలవంచే ప్రసక్తే లేదని తుమ్మల ప్రకటించారు.

అంతకుముందు హైదరాబాద్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో ఖమ్మం చేరుకున్న తుమ్మలకు నాయకన్ గూడెం దగ్గర అభిమానులు ఘన స్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు నుంచి సుమారు వెయ్యి కార్లు, రెండు వేల బైక్‌లతో ఖమ్మం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఇటీవ‌ల 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో తుమ్మల నాగేశ్వరావు పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు భగ్గుమన్నారు. పార్టీ మారాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలేరు నుంచి పోటీ చేయించాలని తుమ్మల అనుచరులు పట్టుదలతో ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన తుమ్మల.. కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌ కుమార్ చేతిలో ఓడిపోయారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు తుమ్మల. కొంతకాలం ఎమ్మెల్సీగా సేవలందించారు. 2016లో పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ తొలి ప్రభుత్వం రోడ్లు, భవనాల శాఖ మంత్రిగానూ సేవలందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పాలేరు నుంచి పోటీకి దిగిన తుమ్మల.. కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత కందాల బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. పాలేరు టికెట్‌ తనకే వస్తుందనుకున్న తుమ్మల ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కందాలకే టికెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో తుమ్మల ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా..లేదా మరో పార్టీలో చేరతారా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

*

First Published:  25 Aug 2023 7:44 PM IST
Next Story