Telugu Global
Telangana

కేసీఆర్‌తోనే నా రాజకీయ జీవితం.. పార్టీ మార్పుపై తుమ్మల క్లారిటీ

కేసీఆర్‌తోనే తన రాజకీయ జీవితం ముడి పడి ఉందని.. ఆయనతోనే కలిసి నడుస్తానని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.

కేసీఆర్‌తోనే నా రాజకీయ జీవితం.. పార్టీ మార్పుపై తుమ్మల క్లారిటీ
X

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మార్పుపై క్లారిటీ వచ్చేసింది. తుమ్మల పార్టీ మారతారంటూ కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్‌పై అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారం కూడా జరిగింది. కాగా, కేసీఆర్‌తోనే తన రాజకీయ జీవితం కొనసాగుతుందని తుమ్మల స్పష్టం చేశారు. ములుగు జిల్లా వాజేడు సమీపంలో తన అనుచరులు, అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెర దించారు.

రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమని.. తాత్కాలికమైన భోగభాగ్యాల కోసం ఆరాటపడితే మనం నష్ట పోతామని అన్నారు. రాజకీయాలు అన్నాక గెలుపోటములు సాధారణం. నీతి, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప.. నీతిమాలిన రాజకీయాలు చేయనని తుమ్మల చెప్పారు. నేను ఎవరినీ పిలవక పోయినా ఇంత మంది అభిమానులు ఈ సమ్మేళనానికి రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని చెప్ారు. కష్ట నష్టాల్లో మీరందరూ నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. మీ అభిమానానికి చాలా ఆనందంగా ఉందని అన్నారు.

తనతో ఉండమని సీఎం కేసీఆర్ అన్నారు. సీతారామ ప్రాజెక్టు కోసం నేను ఆయనతో కలిసి నడుస్తున్నానని చెప్పారు. ఈ ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మారితే ఇక్కడి నుంచే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్లు వస్తాయని చెప్పారు. ఇవ్వాళ జిల్లా అంతా సస్యశ్యామలంగా ఉండటానికి సీఎం కేసీఆర్ కారణమని వెల్లడించారు. ఆయన రాష్ట్రమంతా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొని రావాలని కేసీఆర్ చూస్తున్నారు. ఏపీ కంటే తెలంగాణ అభివృద్ధి పరంగా ఎంతో ముందు ఉన్నది. సత్తుపల్లిలో రైల్వే జంక్షన్ కూడా రాబోతోంది. ఇవన్నీ కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధే అని చెప్పారు.

కేసీఆర్‌తోనే తన రాజకీయ జీవితం ముడి పడి ఉందని.. ఆయనతోనే కలిసి నడుస్తానని చెప్పారు. నేను అభివృద్ధి చేసిన వ్యక్తులు ఇవ్వాళ ఎక్కడెక్కడో ఉన్నారు. కానీ నేను ఏమీ చేయని మనుషులు మాత్రం నా వెంట నడుస్తున్నారు. మళ్లీ నా రాజకీయ జీవితం మీ చేతుల్లో పెడుతున్నానని తుమ్మల ఉద్వేగంగా మాట్లాడారు. భగవంతుడు కనుక మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తానని తుమ్మల మాటిచ్చారు. ఈ సభ కేవలం యాదృశ్చికంగా జరిగిందే అని చెప్పారు. తుమ్మల ఇవ్వాళ మాట్లాడిన మాటలతో ఆయన పార్టీ మారబోరని స్పష్టం అయ్యింది. కాగా, రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎంపీగానా, ఎమ్మెల్యేగానా అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే ఏ పదవిని చేపట్టడానికైనా సిద్ధంగా ఉన్నానని తుమ్మల స్పష్టం చేశారు.

First Published:  10 Nov 2022 6:53 PM IST
Next Story