Telugu Global
Telangana

వైసీపీ ప్రోగ్రామ్‌ను కాపీ కొట్టిన తెలుగుదేశం.. రేపటి నుంచి తెలంగాణలో అమలు

వైసీపీ ప్రోగ్రామ్‌ను కాపీ కొట్టిన తెలుగుదేశం.. రేపటి నుంచి తెలంగాణలో అమలు
X

తెలంగాణ రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోయిన తెలుగుదేశం పార్టీని తిరిగి బలోపేతం చేయాలని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు భావిస్తున్నారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా టీడీపీని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ను నియమించారు. ఇటీవల తెలంగాణ ప్రాంతంలో పలువురు కీలక నాయకులను కూడా నియమించారు. టీడీపీకి సాంప్రదాయంగా వస్తున్న ఓటు బ్యాంకు ఇంకా ఉందని అధిష్టానం నమ్ముతోంది. మరోసారి కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకొని వచ్చే కార్యక్రమాలు చేపట్టడానికి రంగం సిద్ధం చేశారు.

టీడీపీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. ప్రతీ ఇంటికి వెళ్లి గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం అచ్చం ఏపీలోని అధికార వైసీపీ అమలు చేస్తున్న 'గడప గడపకు మన ప్రభుత్వం' లాగానే ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రతీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరుగుతూ వైఎస్ జగన్ హయాంలో అమలు చేసిన పథకాలను వివరిస్తున్నారు. అంతే కాకుండా ఏ కుటుంబం ఎంత మేర లబ్ది పొందిందో కూడా లెక్కలు చూపిస్తున్నారు.

ఇప్పుడు సేమ్ అలాంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చేపట్టాలని అనుకోవడం గమనార్హం. ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. టీడీపీ గతంలో చేసిన అభివృద్ధిని వివరించడమే కాకుండా.. పార్టీ పూర్వవైభవం కోసం చేపట్టాల్సిన పనులను సూచించాల్సిందిగా ప్రజలను కోరనున్నట్లు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు.

10 రోజుల తర్వాత అన్ని గ్రామాల్లో బస్సు యాత్రలు ఉంటాయని టీటీడీపీ వివరించింది. ఇక మార్చి 29న టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నట్లు జ్ఞానేవ్వర్ తెలిపారు.

First Published:  25 Feb 2023 6:39 PM IST
Next Story