కరీంనగర్ లో తిరుమల నమూనా ఆలయం
కరీంనగర్ లో టీటీడీ ఆలయం కోసం ఈ నెల 31న ఉదయం 7.26 గంటలకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత అదే ప్రాంగణంలో సాయంత్రం శ్రీవేంకటేశ్వరుని కళ్యాణోత్సవం నిర్వహిస్తారు.
తిరుమల శ్రీవారి నమూనా ఆలయాలను అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఏడుకొండలవాడు ఇకపై కరీంనగర్ లో కూడా కొలువుదీతరాడన్నమాట. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇక్కడ ఆలయం నిర్మిస్తారు. దీనికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కేటాయించింది. ఆలయ నిర్మాణం కోసం టీటీడీ రూ.20కోట్లు ఖర్చు చేస్తుంది.
కరీంనగర్ లో నిర్మించబోతున్న ఆలయ నిర్మాణ అనుమతి పత్రాలను తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ జి.భాస్కర్ రావు కి అందజేశారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. తెలంగాణ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో కరీంనగర్ పట్టణంలో రూ.20 కోట్ల వ్యయంతో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారాయన.
ఈనెల 31న శంకుస్థాపన..
కరీంనగర్ లో టీటీడీ ఆలయం కోసం ఈనెల 31న ఉదయం 7.26 గంటలకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత అదే ప్రాంగణంలో సాయంత్రం శ్రీవేంకటేశ్వరుని కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలి ఉండేలా ఇక్కడ కూడా నూతన ఆలయం నిర్మించబోతున్నారు. త్వరలోనే తెలంగాణ నుంచి ఓ బృందం తిరుమలకు వెళ్లి అక్కడి ఆలయ నిర్మాణం, అంతరాలయాలు, గోపురాలు, పోటు, ప్రసాద వితరణ కేంద్రం తదితర అంశాలను పరిశీలిస్తుంది. కరీంనగర్ లో కూడా అలాంటి నమూనాలతోనే ఆలయం నిర్మిస్తారు.