Telugu Global
Telangana

టీఎస్‌టీపీపీ ట్రయల్ రన్ సక్సెస్.. 72 గంటల్లో 811 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

రెండో యూనిట్ పూర్తి చేయడం ద్వారా మరో 800 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో తొలి దశలో 1,600 మెగావాట్ల విద్యుత్ తెలంగాణకు అందుబాటులోకి రానున్నది.

టీఎస్‌టీపీపీ ట్రయల్ రన్ సక్సెస్.. 72 గంటల్లో 811 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
X

తెలంగాణ విద్యుత్ అవసరాల కోసం రామగుండం ఎన్టీపీసీ ఆవరణలో నిర్మించిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (టీఎస్‌టీపీపీ) ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కేవలం రాష్ట్ర అవసరాల కోసం 4 వేల మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంటు నిర్మించాల్సి ఉన్నది. ఇందులో భాగంగా తొలి దశలో 800 మెగావాట్ల చొప్పున 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్ల ప్లాంట్‌ను నిర్మించారు.

టీఎస్టీపీపీ తొలి దశ నిర్మాణం పూర్తి కావడంతో అధికారులు ట్రాయల్ రన్ నిర్వహించారు. ఈ ఏడాది జూలైలోనే యూనిట్ లైటప్‌తో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. అనంతరం దీన్ని గ్రిడ్‌కు అనుసంధానించి కమర్షియల్ ఆపరేషన్ డిక్లేర్ (సీవోడీ)గా ప్రకటించడానికి ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ నెల 2 నుంచి 5 మధ్య 72 గంటల పాటు ఏకధాటిగా 811.4 మెగావాట్ల విద్యుత్‌ను ఇది గ్రిడ్‌కుఅందించింది. దీంతో టీఎస్టీపీపీ తొలి దశ విద్యుత్ సీవోడీకి అర్హత సాధించిందని, ట్రయల్ రన్ పూర్తిగా సక్సెస్ అయ్యిందని అధికారులు ప్రకటించారు. ఇక రెండో యూనిట్ పూర్తి చేయడం ద్వారా మరో 800 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో తొలి దశలో 1,600 మెగావాట్ల విద్యుత్ తెలంగాణకు అందుబాటులోకి రానున్నది.

సింగరేణిలో రెండో దశ సోలార్ పవర్ ప్లాంట్లు..

సింగరేణి సంస్థ సౌర విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి ఎప్పుడో ప్రవేశించింది. ఇప్పటికే తొలి దశ విద్యుదుత్పత్తి ప్లాంటును నెలకొల్పి విజయవంతంగా నడిపిస్తోంది. ఇక రెండో దశలో ఎనిమిది చోట్ల ప్లాంట్లు నిర్మించాలని నిర్ణయించింది. రూ.1,348 కోట్ల వ్యయంతో మొత్తం 323 మెగావాట్ల ప్లాంట్లకు నేషనల్ టెండర్లను పిలిచింది. ఈ నెల 25 లోపు టెండర్లను దాఖలు చేసే వీలున్నది.

రెండో దశ సోలార్ ప్లాంట్లను సింగరేణి పరిధిలోని 8 ప్రాంతాలు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో లభిస్తున్న ఓపెన్ ల్యాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండనున్నది. మందమర్రిలో 240 ఎకరాల్లో 67.5 మెగావాట్లు, రామగుండం మూడు ఏరియాల్లోని 166 ఎకరాల్లో 37 మెగావాట్లు, శ్రీరాంపూర్ ఏరియాలో 96 ఎకరాల్లో 32.5 మెగావాట్లు, కొత్తగూడెం 130 ఎకరాల్లో 32.5 మెగావాట్లు, ఇల్లందు 55 ఎకరాల్లో 15 మెగావాట్లు, భూపాలపల్లి 45 ఎకరాల్లో 10 మెగావాట్లు, రామగుండం-1 ఏరియాలో 13 ఎకరాల్లో 5 మెగావాట్ల ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది.

మరో ఏడాదిలోనే సింగరేణి మొత్తం 530 మెగావాట్ల ద్వారా 700 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నది. దీని వల్ల దేశంలోనే జీరో కర్బన ఉద్గారాల కోల్ కంపెనీగా సింగరేణి చరిత్ర సృష్టించనున్నట్లు సీఎండీ శ్రీధర్ తెలిపారు. పర్యావరణ హితంగానే ఈ ప్రాజెక్టు ఉండటం కాకుండా.. ఏడాదికి రూ.500 కోట్ల మేర ఆదా అవతుందని ఆయన చెప్పారు. సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను పూర్తిగా సంస్థ గనులు, కాలనీల అవసరాలకే ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు సొంత అవసరాలకు థర్మల్ విద్యుత్ ప్లాంట్లపై ఆధారపడగా.. ఇకపై సోలార్ పవర్ ద్వారానే సొంత అవసరాలు తీర్చుకోనున్నది.

First Published:  7 Sept 2023 5:59 AM IST
Next Story