హైదరాబాద్ - షిర్డీ విమాన యాత్ర.. టీఎస్‌టీడీసీ కొత్త ప్యాకేజీ
రూ.12,499 టికెట్ ధరతో టీఎస్‌టీడీసీ ఈ యాత్రను ప్రారంభించింది. కొన్ని ఆలయాల్లో దర్శన టికెట్లు భక్తులే కొనుక్కోవాల్సి ఉంటుంది.
హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లాలనుకుంటే దర్శనం పూర్తి చేసుకుని 24 గంటల్లోనే తిరిగొచ్చేలా తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్‌టీడీసీ) విమాన పర్యాటకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రోజూ హైదరాబాద్ నుంచి విమాన యాత్రను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ ఎండీ మనోహర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి విమానాశ్రయానికి చేర్చడం, షిర్డీలో దర్శనం, స్థానిక పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం కూడా ఈ ప్యాకేజీలో భాగమన్నారు. అకామిడేషన్ కూడా తామే కల్పిస్తామని చెప్పారు.
హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు విమానంలో బయల్దేరి 2.30 గంటలకు షిర్డీ చేరుకుంటారు. హోటల్లో ఫ్రెష్ అయిన తర్వాత సాయంత్రం 4.30 గంటలకు సాయి దర్శనం ఉంటుంది. సాయంత్రం హారతిలో పాల్గొన్న తర్వాత రాత్రి 7 గంటలకు బాబా థీమ్ పార్కులోని సౌండ్ అండ్ లైట్ షో చూపిస్తారు. మర్నాడు ఉదయం 8 గంటలకు పంచముఖి గణపతి మందిరం, పాత షిర్డీ, ఖండోబా మందిర్, సాయి తీర్ధం దర్శనాలు చేయిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు విమానంలో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
టికెట్ ధర రూ.12,499
రూ.12,499 టికెట్ ధరతో టీఎస్‌టీడీసీ ఈ యాత్రను ప్రారంభించింది. కొన్ని ఆలయాల్లో దర్శన టికెట్లు భక్తులే కొనుక్కోవాల్సి ఉంటుంది. వివరాలకు 98485 40371, 98481 25720 నంబర్లలో సంప్రదించాలని టీఎస్‌టీడీసీ కోరింది.