Telugu Global
Telangana

హైదరాబాద్‌లో డీజిల్ బస్సులు కనుమరుగు.. టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం

హైదరాబాద్ నగరంలో కాలుష్యరహిత వాహనాల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో ఇకపై టీఎస్ఆర్టీసీ కూడా భాగస్వామ్యం కానున్నది.

హైదరాబాద్‌లో డీజిల్ బస్సులు కనుమరుగు.. టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం
X

విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై నగరంలో డీజిల్ బస్సులను నడపరాదని.. క్రమంగా వాటి సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ జోన్ పరిధిలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నది. రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ జోన్ పరిధిలో డీజిల్ బస్సు అనేది కనిపించదని.. పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులతో వాటిని రిప్లేస్ చేయనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ యాదగిరి స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగరంలో కాలుష్యరహిత వాహనాల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో ఇకపై టీఎస్ఆర్టీసీ కూడా భాగస్వామ్యం కానున్నది. రాబోయే రెండు రోజుల్లో 860 ఎలక్ట్రిక్ బస్సులు నగరంలోని రోడ్లపై పరుగులు పెట్టబోతున్నాయి. సిటీలోని డిపోల పరిధిలో దాదాపు 500 బస్సులకు కాలం చెల్లింది. ఇవన్నీ డీజిల్ బస్సులే. వీటి వల్ల భారీగా కలుష్యం వెలువడుతోంది. అందుకే వీటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టబోతున్నారు. ఒకటి రెండు రోజుల్లో 50 శాతం ఎలక్ట్రిక్ బస్సులే రోడ్లపైకి రానున్నాయి. రాబోయే రోజుల్లో మరో 300 ఎలక్ట్రిక్ బస్సుల కోసం టెండర్లు కూడా పిలిచారు.

ప్రస్తుతం డీజిల్ బస్సుల వల్ల కిలోమీటర్‌కు రూ.20 వరకు ఖర్చు అవుతుంది. అదే ఎలక్ట్రిక్ బస్సు అయితే కిలోమీటర్‌కు రూ.7 మాత్రమే ఖర్చు వస్తుంది. అంటే ఎలక్ట్రిక్ బస్సులు తిప్పడం వల్ల ఆర్టీసీకి రూ.13 మిగులుతుంది. వాస్తవానికి డీజిల్ బస్సులతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ బస్సుల ధర ఎక్కువగా ఉంటుంది. అయితే వీటి నిర్వహణ ఖర్చులు చాలా తక్కువ అందుకే ఎలక్ట్రిక్ బస్సులను భారీగా కొనుగోలు చేయడానికి ఆర్టీసీ ఆసక్తిగా ఉన్నది. ఇప్పటికే నగరంలోని పలు ఆర్టీసీ డిపోల్లో చార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో అన్ని డిపోల్లో విద్యుత్ బస్సుల కోసం చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు.

కేవలం సిటీ బస్సులే కాకుండా ఇంటర్ సిటీ పేరుతో దగ్గరలోని పట్టణాలకు కూడా విద్యుత్ బస్సులను నడపనున్నారు. వీటి కోసం కూడా బస్సులు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం చెంగిచర్ల, కాచిగూడ, బర్కత్‌పుర, మెహదీపట్నం, హెచ్‌సీయూ డిపోలకు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు.

First Published:  26 Feb 2023 11:15 AM IST
Next Story