నేటి నుంచి టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్ సర్వీసులు.. మంత్రి అజయ్ చేతుల మీదుగా ప్రారంభం
12 మీటర్ల పొడవైన ఈ ఏసీ స్లీపర్ బస్సులో మొత్తం 30 బెర్తులు ఉన్నాయి. పైన 15, కింద 15 బెర్తులు ఏర్పాటు చేశారు. ప్రతీ ప్రయాణికుడికి వాటర్ బాటిల్ అందిస్తారు. అలాగే ప్రతీ బెర్త్ వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉన్నది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఏసీ స్లీపర్ బస్సు సేవలను ప్రారంభించనున్నది. నేడు ఎల్బీనగర్‌లో ఉదయం 9.30 గంటలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 'లహరి' ఏసీ స్లీపర్ కోచ్‌లను ప్రారంభించనున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. తొలి దశలో ఆర్టీసీ 16 స్లీపర్ బస్సులను పలు దూర ప్రాంతాలకు నడపనున్నట్లు తెలిపింది.
ప్రైవేట్ ఆపరేటర్లను ధీటుగా ఎదుర్కోవడానికి అన్ని హంగులతో కూడిన బస్సులను స్వయంగా టీఎస్ఆర్టీసీ డిజైన్ చేయించింది. ప్రయాణికులకు గొప్ప సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మొదటి దశలో ఈ 16 బస్సులను ఏపీలోని తిరుపతి, విశాఖపట్నం.. తమిళనాడులోని చెన్నై.. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ ప్రాంతాలకు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ 630 కొత్త సూపర్ లగ్జరీ బస్సులు, ఎనిమిది నాన్-ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు, నాలుగు స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. తాజాగా ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభిస్తోంది.
ఈ ఏసీ స్లీపర్ బస్సులకు లహరి అని నామకరణం చేయగా.. 'అమ్మ ఒడి లాంటి అనుభూతి' అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టింది. ఈ బస్సులు ప్రయాణికులకు కొత్త అనుభూతిని ఇస్తాయని సంస్థ చెబుతోంది. ఈ బస్సులో ఉచిత వైఫైతో పాటు బస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉన్నది. అలాగే పానిక్ బటన్ ఫెసిలిటీ ఉన్నది. ఏదైనా ఆపద సమయంలో ఈ బటన్ ప్రెస్ చేస్తే టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది. వెంటనే అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
12 మీటర్ల పొడవైన ఈ ఏసీ స్లీపర్ బస్సులో మొత్తం 30 బెర్తులు ఉన్నాయి. పైన 15, కింద 15 బెర్తులు ఏర్పాటు చేశారు. ప్రతీ ప్రయాణికుడికి వాటర్ బాటిల్ అందిస్తారు. అలాగే ప్రతీ బెర్త్ వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉన్నది. అలాగే రీడింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఇక బస్సు ముందు, వెనుక భాగాల్లో ఎల్ఈడీ డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. ఇది ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని తెలియజేస్తాయి. అలాగే ప్రయాణికుల భద్రత కోసం సీసీ టీవీ కెమేరాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక డ్రైవర్ సౌలభ్యం కోసం రివర్స్ పార్కింగ్ కెమేరా కూడా ఉంది. అలాగే ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు.
ప్రయాణికులకు శుభవార్త! 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు రేపటి నుండి అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా వీటిని #TSRTC వాడకంలోకి తెస్తోంది. LB Nagar లో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) March 26, 2023
బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభిస్తారు. #NewACSleeperBuses pic.twitter.com/WBrFy37xmt