Telugu Global
Telangana

TSRTC T-9 టికెట్.. దీని ప్రయోజనాలు ఏంటంటే..?

T-9 టికెట్ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్‌ కు వర్తిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుంది.

TSRTC T-9 టికెట్.. దీని ప్రయోజనాలు ఏంటంటే..?
X

తెలంగాణ ఆర్టీసీ ప్రజలకు చేరువయ్యేందుకు రకరకాల ఆకర్షణీయ పథకాలతో ముందుకొస్తోంది. ఇప్పటికే T-6, T-24, F-24 టికెట్లను తెరపైకి తెచ్చిన ఆర్టీసీ ఇప్పుడు కొత్తగా T-9 టికెట్ ప్రవేశ పెట్టింది. గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికుల సౌకర్యార్థం T-9 టికెట్‌ ను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపింది. హైదరాబాద్‌ లోని బస్ భవన్‌ లో శుక్ర‌వారం T-9 టికెట్ పోస్టర్‌ ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. ఈ టికెట్లు ఈ నెల 18 నుంచి పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపారు.


T-9 అంటే..?

T-9 టికెట్ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్‌ కు వర్తిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుంది. ఈ టికెట్ ద్వారా 60 కిలోమీటర్ల పరిధిలో ఒకసారి రానుపోను ప్రయాణం చేయొచ్చు. T-9 టికెట్ ధర 100 రూపాయలు. టోల్ గేట్ చార్జీలు దీనికి ఉండవు. 60కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే వారు ఈ టికెట్ తీసుకుంటే 20 రూపాయలనుంచి 40 రూపాయల వరకు ఆదా అవుతుంది.

కన్సెషన్ టికెట్లను ఓసారి గమనిస్తే..

T-24

ఈ టికెట్ ధర ప్రస్తుతం 100 రూపాయలుగా ఉంది. గ్రేటర్ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సిటీ బస్సుల్లో 24 గంటలపాటు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించేదే T-24 టికెట్‌.

T-6

మహిళలు, సీనియర్‌ సిటిజన్ల కోసం T-6 టికెట్ అందుబాటులో ఉంది. దీని ధర 50రూపాయలు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ఆరు గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే T-6 టికెట్‌ చెల్లుబాటు అవుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ టికెట్‌ ను బస్సుల్లో కండక్టర్లు ఇస్తారు.

F-24

వీకెండ్స్, సెలవుల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ప్రయాణించేందుకు వీలుగా F-24 టికెట్‌ గతంలో TSRTC అందుబాటులోకి తెచ్చింది. ఈ టికెట్‌ ధర రూ.300 నలుగురు కుటుంబ సభ్యులు రోజంతా సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఐదేళ్ల లోపు చిన్నారులకు ప్రయాణం ఉచితం. శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో మాత్రమే ఈ ఫ్యామిలీ టికెట్ ఆఫర్‌ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. వీటికి తోడు ఇప్పుడు గ్రామీణ, పట్టణప్రాంత ప్రయాణికులకోసం TSRTC సంస్థ T-9 టికెట్ ని అందుబాటులోకి తెచ్చింది.

First Published:  16 Jun 2023 10:29 AM GMT
Next Story