టీఎస్ఆర్టీసీ రికార్డ్ బ్రేక్.. ఒక్కరోజులోనే రూ.12కోట్ల ఆదాయం
మహిళలకు జీరో టికెట్ పద్ధతి ప్రవేశ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు 9కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్టు తెలిపారు అధికారులు. అయితే ఆ టికెట్ల మొత్తం ఖరీదు ఎంతనేది బయటపెట్టలేదు.
తెలంగాణ ఆర్టీసీ తన రికార్డుల్ని తానే బ్రేక్ చేస్తోంది. ఆదాయంలో సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈనెల 13వతేదీన 12కోట్ల రూపాయల ఆదాయం కళ్లజూసింది. ఆరోజు 52.78 లక్షలమంది తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్టు అధికారులు చెబుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉండటంతో ఈసారి చాలా కుటుంబాలు ఆర్టీసీని ఆశ్రయించాయి. బస్సుల సంఖ్య పెంచడం కూడా ఆర్టీసీకి కలిసొచ్చింది.
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ వాసులు ఇతర ప్రాంతాలవారు పండగలకు సొంతూళ్లకు బయలుదేరారు. ప్రతి ఏడాదీ సంక్రాంతికి భారీ రద్దీ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం మహిళల ఉచిత రవాణా ప్రభావం స్పష్టంగా కనపడింది. మహిళలతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆర్టీసీనే ఆశ్రయించారు. దీంతో ఆర్టీసీకి 13వతేదీ భారీగా ఆదాయం వచ్చింది.
9కోట్ల జీరో టికెట్లు..
మహిళలకు జీరో టికెట్ పద్ధతి ప్రవేశ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు 9కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్టు తెలిపారు అధికారులు. అయితే ఆ టికెట్ల మొత్తం ఖరీదు ఎంతనేది బయటపెట్టలేదు. ఈ నెల 11న 28 లక్షలు, 12న 28 లక్షలు, ఈ నెల 13న గరిష్టంగా 31 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 11, 12, 13 తేదీల్లో 4,400 ప్రత్యేక బస్సులు నడిపింది టీఎస్ఆర్టీసీ. ఇప్పటి వరకు మొత్తం 6,261 ప్రత్యేక బస్సులను నడిపారు.