రూ.151/.. ఇంటికే రాములోరి కల్యాణ తలంబ్రాలు
రాములోరి తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చే ప్రక్రియ రెండేళ్లుగా జరుగుతోంది. ఈ సేవలకు భక్తుల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది.

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను ఈ ఏడాది కూడా భక్తులకు అందజేసేందుకు TSRTC సిద్ధమైంది. గతేడాదిలానే ఈసారి కూడా దేవాదాయశాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలు భక్తుల ఇళ్లకు చేర్చేందుకు రెడీ అయ్యారు అధికారులు. రాములోరి తలంబ్రాలు కావాలనుకునే భక్తులు TSRTC లాజిస్టిక్స్ కేంద్రాల్లో 151 రూపాయలు చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలి. 17న సీతారామచంద్రుల కల్యాణం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేస్తారు.
భద్రాచలంలో 17న జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. రాష్ట్రంలోని అన్ని TSRTC లాజిస్టిక్స్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చు. TSRTC మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లు స్వీకరిస్తారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు TSRTC కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-69440069, 040-23450033ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
రాములోరి తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చే ప్రక్రియ రెండేళ్లుగా జరుగుతోంది. ఈ సేవలకు భక్తుల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. 2022లో దాదాపు 89 వేల మంది భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకోగా.. గతేడాది లక్షా 17వేల మంది భక్తులు ఆర్డర్ చేసుకున్నారు.