ఐటీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్..
ఐటీ ఉద్యోగులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చడమే ప్రత్యేక షటిల్ బస్సు సర్వీసుల ప్రధాన ఉద్దేశమని అంటున్నారు టీఎస్ఆర్టీసీ అధికారులు. ఈ సేవలకోసం ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రత్యేక యాప్ తీసుకొస్తోంది.
ఐటీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వారికోసం షటిల్ సర్వీసుల్ని నడిపేందుకు నిర్ణయించింది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ షటిల్ సర్వీసుల్ని నడిపేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. టికెట్ బుకింగ్ కోసం ప్రత్యేక యాప్ తీసుకు రాబోతున్నారు, బస్సు ట్రాకింగ్ సదుపాయం కూడా అందుబాటులోకి తెస్తారు. ఈ షటిల్ సర్వీస్ లలో ప్రయాణానికి సుముఖత వ్యక్తం చేస్తున్న ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది టీఎస్ఆర్టీసీ.
ఐటీ ఉద్యోగుల్లో చాలామందికి వ్యక్తిగత వాహనాలు ఉన్నా, వాటిలో ఆఫీస్ కి రావాలంటే గంటల తరబడి ట్రాఫిక్ లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మెట్రోలో ప్రయాణ బడలిక తెలియకపోయినా రద్దీతో కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సిందే. ఈ గ్యాప్ ని భర్తీ చేయడానికి టీఎస్ఆర్టీసీ ముందుకొచ్చింది. షటిల్ సర్వీసులకోసం ఆన్ లైన్ సర్వే ద్వారా ఉద్యోగులనుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది టీఎస్ఆర్టీసీ. ఈ సర్వే వివరాల ఆధారంగా భవిష్యత్తులో ఐటీ కారిడార్‌లో మరిన్ని షటిల్ సర్వీసులను పెంచుతామంటున్నారు అధికారులు. ఐటీ ఉద్యోగుల కంపెనీ వివరాలు, లొకేషన్, పికప్, డ్రాపింగ్ పాయింట్ల వివరాలు సేకరిస్తున్నారు.
సురక్షితం, సుఖవంతమైన ప్రయాణం..
ఐటీ ఉద్యోగులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చడమే ప్రత్యేక షటిల్ బస్సు సర్వీసుల ప్రధాన ఉద్దేశమని అంటున్నారు టీఎస్ఆర్టీసీ అధికారులు. ఈ సేవలకోసం ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రత్యేక యాప్ తీసుకొస్తోంది. ఈ యాప్ లోనే టికెట్ బుకింగ్ సదుపాయం కల్పిస్తుంది. ఈ షటిల్ సర్వీసులకు ట్రాకింగ్ సదుపాయం కూడా ఉంటుంది. మహిళల భద్రత విషయంలో షటిల్ బస్సుల్లో ట్రాకింగ్ సదుపాయాన్ని కల్పించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రత్యేక యాప్‌లో సర్వీస్ నంబర్, డ్రైవర్, కండక్టర్ ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు ఉంటాయి.