Telugu Global
Telangana

హైదరాబాద్ దర్శన్.. టీఎస్ఆర్టీసీ సరికొత్త ప్యాకేజ్

ఏదైనా ఫ్యామిలీ హైదరాబాద్ అంతా తిరగాలంటే చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. 'హైదరాబాద్ దర్శన్' పేరుతో తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ ఆకట్టుకునేలా ఉంది.

హైదరాబాద్ దర్శన్.. టీఎస్ఆర్టీసీ సరికొత్త ప్యాకేజ్
X

టీఎస్ఆర్టీసీని ప్రయాణికులు చేరువ చేసేందుకు మేనేజ్‌మెంట్ అనేక వినూత్న ప్యాకేజీలు ప్రవేశపెడుతోంది. ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి సంస్థ ఆదాయం పెరిగేలా అనేక చర్యలు తీసుకున్నారు. తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులు టీఎస్ఆర్టీసీలో ప్రయాణిస్తే.. ముందుగానే దర్శనం టోకెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ అవకాశాన్ని తెలంగాణకు చెందిన అనేక మంది ఉపయోగించుకుటున్నారు. అలాగే, టీఎస్ఆర్టీసీ పార్శిల్ సర్వీస్‌ను కూడా మరింత మెరుగు చేశారు. ఇంటి వద్దకే డోర్ డెలివరీ ఇచ్చేలా హైదరాబాద్‌లో కొన్ని సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు.

ఇక హైదరాబాద్ ప్రజలకు మరో కొత్త ప్యాకేజీని ప్రవేశపెట్టారు. నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను ఒకే రోజులో చుట్టి వచ్చే ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఏదైనా ఫ్యామిలీ హైదరాబాద్ అంతా తిరగాలంటే చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. 'హైదరాబాద్ దర్శన్' పేరుతో తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ ఆకట్టుకునేలా ఉంది. మెట్రో ఎక్స్‌ప్రెస్ అయితే పెద్దలకు రూ. 250, పిల్లలకు రూ 150.. మెట్రో లగ్జరీ అయితే పెద్దలకు రూ. 500, పిల్లలకు రూ. 375 చార్జీగా నిర్ణయించారు. లాంఛింగ్ ఆఫర్ కింద 10 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ప్యాకేజీ కింద పలు పర్యాటక ప్రదేశాలను ఒకే రోజులో చుట్టే అవకాశం ఉంది.

ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్ సమీపంలోని ఆల్ఫా హోటల్ వద్ద ఈ బస్సులు ప్రారంభం అవుతాయి. 9.30 నుంచి 10.00 గంటల వరకు బిర్లా మందిర్ వద్దకు చేరుకుంటాయి. అక్కడి దర్శనం అనంతరం.. 10.30 గంటలకు చౌమహల్లా ప్యాలెస్ చేరుకుంటుంది. రెండు గంటల పాటు ప్యాలెస్ చూడటానికి అవకాశం ఇస్తారు. మధ్యాహ్నం 1.00 గంటలకు తారామతి బారాదరి రిసార్ట్ వద్ద ఆగుతుంది. అక్కడ సొంత ఖర్చుపై భోజనం చేయాలి. ఆ తర్వాత 2.00 గంటలకు గోల్కొండ కోట వద్దకు చేరుకుంటుంది. గంటన్నర పాటు అక్కడ గడిపిన తర్వాత బస్సు సాయంత్రం 4.00 గంటలకు దుర్గం చెరువు పార్క్ వద్దకు వస్తుంది. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.00 గంటల వరకు కేబుల్ బ్రిడ్జిపై తిప్పుతారు.

సాయంత్రం 6.30 గంటలకు ఎన్టీఆర్ పార్క్, హుస్సేన్‌సాగర్ చుట్టు బస్సు రైడింగ్ ఉంటుంది. చివరకు రాత్రి 8.00 గంటలకు ఆల్ఫా హోటల్ చేరుకుంటుంది. దసరా సెలవులు కావడంతో ఇవాళ‌ (27 సెప్టెంబర్) నుంచే ఈ ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది. ఎవరైనా రైళ్ల ద్వారా వచ్చి ఒక్క రోజులో పిల్లలతో హైదరాబాద్ చుట్టాలనేకునే వారికి ఈ ప్యాకేజీ మంచిగా ఉపయోగపడుతుందని.. అందుకే ఆల్ఫా హోటల్ నుంచి బస్సులు నడుపుతున్నట్లు అధికారులు చెప్తున్నారు.

First Published:  27 Sept 2022 1:12 PM IST
Next Story