Telugu Global
Telangana

మళ్లీ ప్రభుత్వం మారితే.. TG, TS అవుతుందా..?

సజ్జనార్ మెసేజ్ బాగానే ఉంది కానీ, దానికి ప్రజల నుంచి వస్తున్న స్పందనలు మాత్రం మరింత ఆసక్తికరంగా ఉన్నాయి.

మళ్లీ ప్రభుత్వం మారితే.. TG, TS అవుతుందా..?
X

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక TS ను TGగా మారుస్తున్న సంగతి తెలిసిందే. వాహనాల రిజిస్ట్రేషన్ల విషయంలో ఇప్పటికే అమలులోకి వచ్చిన ఈ మార్పు, సంస్థల విషయంలో కూడా అమలవుతోంది. దీనికి సంబంధించి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో TSRTC ఇకపై TGSRTC అవుతోంది. ఈమేరకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. పేరు మార్చుకున్నామని, సోషల్ మీడియా ఖాతాల్లో కూడా కొత్త పేర్లతో ఉన్న అకౌంట్లు ఉంటాయని, వాటిని ఫాలో కావాలని ప్రయాణికులకు, ప్రజలకు సూచించారు.


సజ్జనార్ మెసేజ్ బాగానే ఉంది కానీ, దానికి ప్రజల నుంచి వస్తున్న స్పందనలు మాత్రం మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. తెలంగాణలో ప్రభుత్వం మారితే TS కాస్తా TG అయింది, ఐదేళ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వం మారితే TS కాస్తా TG అవుతుందా.. కాస్త చెప్పండి సార్ అంటూ ఓ నెటిజన్ ఆయన్ను ప్రశ్నించారు. అసలు ఈ మార్పు వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా, మీలాంటి అధికారులైనా ప్రభుత్వానికి చెప్పాలి కదా.. అని మరొకరు సలహా ఇచ్చారు.

ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తాను అనుకున్నది చేసేసింది. వాహనాల రిజిస్ట్రేషన్ల నెంబర్లతో మొదలు పెట్టి.. పూర్తిగా అన్నిట్లోనూ TS ను మాయం చేసేసింది. తెలంగాణ అంటే TG మాత్రమేనంటోంది. మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు మారితే.. TG ఇంకెలా రూపాంతరం చెందుతుందో చూడాలి.

First Published:  22 May 2024 7:35 PM IST
Next Story