తెలంగాణ ఆర్టీసీ కష్టాలు తీరేనా..! సజ్జనార్ ఏమన్నారంటే..?
మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత 45 రోజుల్లో 12కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారని తెలిపారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. రద్దీని తట్టుకోవడమే ప్రస్తుతం తమ ముందు ఉన్న పెద్ద సవాల్ అని చెప్పారు.
తెలంగాణలో మహిళలకు ఉచిత రవాణా పథకం ప్రారంభమైనప్పటినుంచి ఆర్టీసీ సిబ్బందికి పని ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా కండక్టర్లు రద్దీ తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవర్లపై కూడా ఆ ఒత్తిడి కనపడుతోంది. అటు ప్రయాణికులు కూడా సీట్లకోసం జుట్లు జుట్లు పట్టుకుంటున్న ఘటనలు కోకొల్లలు. బస్సుల్లో సీట్లు దొరక్క పురుషులు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగులకు సీట్లు దొరక్క అవస్థలు పడుతున్నారు. వీటన్నిటికీ పరిష్కారం ఒక్కటే. బస్సుల సంఖ్య పెంచడం. ఆ విషయంలో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
త్వరలో 2,375 బస్సులు..
త్వరలో తెలంగాణ ఆర్టీసీ 2,375 కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకొస్తుందని ప్రకటించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. వీటి ద్వారా ఇప్పుడున్న పరిస్థితి మెరుగవుతుందన్నారు. ప్రస్తుతం రద్దీ కారణంగా ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులు, వికలాంగులు సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తమకు ఫిర్యాదులందుతున్నాయని చెప్పారు. వాటిని పరిష్కరించేందుకు బస్సుల సంఖ్య పెంచుతున్నామన్నారు. అవసరం అనుకుంటే కేవలం వికలాంగులు, వృద్ధులకోసమే ప్రత్యేక సర్వీసులు నడుపుతామన్నారు.
12కోట్లకుపైగా ఫ్రీ టికెట్లు..
మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత 45 రోజుల్లో 12కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారని తెలిపారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. రద్దీని తట్టుకోవడమే ప్రస్తుతం తమ ముందు ఉన్న పెద్ద సవాల్ అని చెప్పారు. రద్దీ పెరిగినా కూడా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బస్సుల్ని నడుపుతున్నామని చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది కూడా కొత్త సవాళ్లను స్వీకరించి పనిచేస్తున్నారని వివరించారు.