టైమ్ వేస్ట్ పనులొద్దు.. టీఎస్ఆర్టీసీ ఎక్కు ముందు
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ టోల్ కష్టాలపై స్పందించారు. సొంత వాహనాల్లో ఊళ్లకు వెళ్తూ టోల్ ప్లాజాల వద్ద సమయాన్ని వృథా చేసుకోవద్దని ఆయన ప్రయాణికులకు సూచించారు.
సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంత ఊళ్లకు బయలుదేరారు. ఇలా వెళ్లే క్రమంలో వ్యక్తిగత వాహనాల్లో ఉన్నవారు టోల్ ప్లాజాల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటలతరబడి అక్కడ వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది ప్రతి ఏడాదీ ఉండే సమస్యే. దీనికి పరిష్కారం లేదు. దాదాపుగా అందరూ ఆరోజు డ్యూటీ అయిపోగానే ఒకేసారి బయలుదేరతారు. దీంతో టోల్ గేట్ల దగ్గర విపరీతమైన రద్దీ ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ మేర ట్రాఫిక్ రోడ్డుపై నిలిచిపోయింది. ఈ ఏడాది విశేషం ఏంటంటే.. ఆర్టీసీ బస్సులు మాత్రం ఈ ట్రాఫిక్ జంఝాటంలో చిక్కుకోలేదు. వాటికి ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడంతో రయ్ రయ్ మంటూ ఆర్టీసీ దూసుకెళ్తోంది, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలు టోల్ ప్లాజా ముందు ఉసూరుమంటూ ఆగిపోయాయి.
ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ టోల్ కష్టాలపై స్పందించారు. సొంత వాహనాల్లో ఊళ్లకు వెళ్తూ టోల్ ప్లాజాల వద్ద సమయాన్ని వృథా చేసుకోవద్దని ఆయన ప్రయాణికులకు సూచించారు. గంటల తరబడి టోల్ ప్లాజాల వద్ద నిరీక్షించే బదులు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు. టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక లైన్ల ద్వారా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని చెప్పారు. ప్రయాణికులను ఆర్టీసీ సిబ్బంది క్షేమంగా సొంతూళ్లకు చేర్చుతారని అన్నారు సజ్జనార్.
సంక్రాంతికి సొంత వాహనాల్లో వెళ్లి టోల్ ప్లాజాల వద్ద గంటల తరపడి నిరీక్షించి మీ సమయాన్ని వృథా చేసుకోకండి. #TSRTC బస్సుల్లో ప్రయాణించి టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక లేన్ల ద్వారా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోండి. మా సిబ్బంది మిమ్ముల్ని క్షేమంగా సొంతూళ్లకు చేర్చుతారు. pic.twitter.com/oENrGRC1QH
— Managing Director - TSRTC (@tsrtcmdoffice) January 13, 2023
ఆర్టీసీ బస్సులు వెళ్లే టోల్ లైన్లు ఖాళీగా ఉండే ఫొటోలను కూడా ఆయన ట్విట్టర్లో ట్యాగ్ చేశారు. పండగ సీజన్లో ఆర్టీసీ బస్సులకు సెపరేట్ లైన్ ఉండేలా టోల్ యాజమాన్యాలతో మాట్లాడారు. దీంతో ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు మాత్రం టోల్ గేట్ల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లిపోతున్నాయి. ప్రైవేట్ వాహనాలు మాత్రం ఎక్కడివక్కడే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఫాస్టాగ్ ఉంటేనే పరిస్థితి ఇలా ఉంటే, గతంలో టోల్ గేట్ల వద్ద డబ్బులు తీసుకునే పరిస్థితులు ఇప్పుడు కూడా ఉంటే ఇంకెంత ట్రాఫిక్ జామ్ అయి ఉండేదో అని అనుకుంటున్నారు ప్రజలు.