Telugu Global
Telangana

బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఇవి తప్పనిసరి.. ఆర్టీసీ కీలక ప్రకటన

మహిళలు ఐడీ కార్డులు చూపడం తప్పనిసరి అని ఆర్టీసీ ప్రకటించినప్పటికీ చాలామంది ఒరిజినల్ ఐడీ కార్డులు చూపించడం లేదు. ఆధార్, ఓటర్ ఐడీ జిరాక్స్ లు, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ లు చూపిస్తున్నారు.

బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఇవి తప్పనిసరి.. ఆర్టీసీ కీలక ప్రకటన
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతిని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల కిందట ఈ పథకం ప్రారంభం అయ్యింది. మొదట్లో మహిళలు ఎటువంటి ఐడీ కార్డులు చూపకపోయినప్పటికీ అధికారులు ఉచిత ప్రయాణానికి అనుమతించారు. అయితే కొద్దిరోజుల తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించాలంటే మహిళలు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్సు కార్డులలో ఏదో ఒకటి కండక్టర్ కు చూపించాలని ఆర్టీసీ కోరింది.

మహిళలు ఐడీ కార్డులు చూపడం తప్పనిసరి అని ఆర్టీసీ ప్రకటించినప్పటికీ చాలామంది ఒరిజినల్ ఐడీ కార్డులు చూపించడం లేదు. ఆధార్, ఓటర్ ఐడీ జిరాక్స్ లు, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ లు చూపిస్తున్నారు. లేదంటే తమ మొబైల్ ఫోన్లలోని ఐడీ కార్డుల ఫొటోలను చూపిస్తున్నారు.

దీనిపై తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపిస్తేనే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంటుందని స్పష్టంచేశారు. ఐడీ కార్డుల జిరాక్సులు, మొబైల్ ఫోన్ లోని ఫొటోలు చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని తెలిపారు. అలాగే ఫొటోలు స్పష్టంగా కనిపించే ఐడీ కార్డులు మాత్రమే మహిళలు కండక్టర్ కు చూపించాలని సజ్జనార్ కోరారు. ఒకవేళ ఫొటోలు సరిగా కనిపించకపోతే అప్డేట్ చేసుకోవాలని ఆయన సూచించారు.

First Published:  20 Dec 2023 5:51 PM IST
Next Story