Telugu Global
Telangana

రిజర్వేషన్‌పై డిస్కౌంట్, బస్ ట్రాకింగ్ సిస్టమ్, ఆర్టీసీ రేడియో.. దూసుకొని పోతున్న టీఎస్ఆర్టీసీ

టీఆఎస్ఆర్టీసీ సరికొత్త ఆఫర్‌ను ముందుకు తీసుకొని వచ్చింది. ఇకపై ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుంటే భారీగా డిస్కౌంట్లు ఇవ్వనుట్లు సంస్థ ప్రకటించింది.

రిజర్వేషన్‌పై డిస్కౌంట్, బస్ ట్రాకింగ్ సిస్టమ్, ఆర్టీసీ రేడియో.. దూసుకొని పోతున్న టీఎస్ఆర్టీసీ
X

టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు దగ్గరయ్యేందుకు సరికొత్త హంగులను తీర్చిదిద్దుకుంటోంది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు ధీటుగా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ముందుకు దూసుకొని పోతోంది. కొత్త రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీ మొదట్లో కొన్ని సమస్యలను ఎదుర్కున్నా.. సీఎం కేసీఆర్ నిధులు కేటాయించడంతో ఇప్పుడు మెరుగైన సేవలు అందిస్తోంది. పండుగల సమయంలో భారీగా ప్రత్యేక బస్సులు వేసినా సాధారణ రేట్లకే నడిపి అందరి మన్ననలు పొందింది. గతంలో పండుగలు వస్తే ప్రైవేటుతో పాటు ఆర్టీసీ కూడా అదనంగా చార్జీలు వసూలు చేస్తుండేది. కానీ దానికి టీఎస్ఆర్టీసీ చరమ గీతం పాడింది.

తాజాగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎండీ సజ్జనార్ నేతృత్వంలోని టీఆఎస్ఆర్టీసీ సరికొత్త ఆఫర్‌ను ముందుకు తీసుకొని వచ్చింది. ఇకపై ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుంటే భారీగా డిస్కౌంట్లు ఇవ్వనుట్లు సంస్థ ప్రకటించింది. ఏ గమ్యస్థానానికి అయినా ఆన్‌లైన్‌లో 31 నుంచి 45 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే 5 శాతం రాయితీ లభించనున్నది. అలాగే 46 నుంచి 60 రోజుల ముందే టికెట్ బుక్ చేసుకుంటే ఏకంగా 10 శాతం రాయితీ ప్రకటించింది. ఈ మేరకు ఆన్‌లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (ఓపీఆర్ఎస్) సాఫ్ట్‌వేర్‌ను సంస్థ అప్‌డేట్ చేసింది.

ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ ఉన్న అన్ని బస్ సర్వీసులకు ఈ రాయితీ వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. సంక్రాంతికి ముందే అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్‌ను 30 నుంచి 60 రోజులకు పెంచింది. ఈ రాయితీలు ప్రస్తుతం ఈ ఏడాది జూన్ వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రయాణికుల నుంచి ఈ స్కీమ్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఎండాకాలం సెలవులు వస్తుండటంతో అప్పటి కోసం ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు.

ట్రాకింగ్ సిస్టమ్..

ఇకపై మీరు ఎక్కాల్సిన బస్సు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి టీఎస్ఆర్టీసీ వీలు కల్పిస్తోంది. రాష్ట్రంలోని దాదాపు 4,200 బస్సులకు ట్రాకింగ్ సిస్టమ్‌ను అమర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ కింద 1,800 బస్సుల్లో ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. దీని వలన ఏ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునే వీలుంటుంది. హైదరాబాద్ సిటీలోని డిపోలకు చెందిన ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ ట్రాకింగ్ సిస్టమ్ ఉన్నది. రాబోయే రోజుల్లో జిల్లాల్లోని బస్సులకు కూడా పూర్తి స్థాయిలో ట్రాకింగ్ సిస్టమ్ అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.

సర్వీస్ నెంబర్ ఆధారంగా బస్సు ఎక్కడుందో తెలుసుకునే అవకాశం ఉన్నది. ఇక రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఒక ట్రాకింగ్ లింక్‌ను ఎస్ఎంఎస్ చేస్తుంది. ఈ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా బస్సు ఎక్కడ ఉన్నది. తాము ఉన్న స్టాప్ వద్దకు ఏ సమయంలో లోపు చేరుకుంటుందనే సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది.

ఇక టీఎస్ఆర్టీసీ యాప్ ద్వారా కూడా బస్సులను ట్రాక్ చేయవచ్చు. దీని వల్ల మహిళల భద్రత సమస్యలు, బస్సుల బ్రేక్ డౌన్, మెడికల్ ఎమర్జెన్సీ, రోడ్డు ప్రమాదాలు, అత్యవసర సమయాల్లో యాప్ ద్వారా వెంటనే సంస్థకు నివేదించవచ్చు. ఇలా వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే ప్రతిస్పందించేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు.

టీఎస్ఆర్టీసీ రేడియో..

బస్సుల్లో ప్రయాణించే వారికి వినోదాన్ని పంచేందుకు సరికొత్తగా 'టీఎస్ఆర్టీసీ రేడియో'ను గత వారం ప్రారంభించారు. ప్రస్తుతం సంస్థకు చెందిన కొన్ని బస్సుల్లో ఏర్పాటు చేశారు. ప్రయాణికుల నుంచి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి మరిన్ని సర్వీసులకు దీనిని విస్తరిస్తామని సజ్జనార్ వివరించారు. ప్రయాణికులు ఈ రేడియోను ఆదరించాలని ఆయన కోరారు.



First Published:  2 Feb 2023 5:39 AM GMT
Next Story