టీఎస్ఆర్టీసీలో ఇండిపెండెన్స్‌డే ఆఫర్లు.. అన్‌లిమిటెడ్ జర్నీ, 50 శాతం డిస్కౌంట్లు
స్వాతంత్ర దినోత్సవం అయిన ఆగస్టు 15న ఒక్క రోజు మాత్రమే ఈ రాయితీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని యాజమాన్యం తెలియజేసింది.
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా.. అవసరమైన సమయంలో డిస్కౌంట్, వినూత్న ఆఫర్లు ప్రకటిస్తూ టీఎస్ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకుంటోంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మరోసారి ఆర్టీసీ యాజమాన్యం పలు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. హైదరాబాద్ సిటీ బస్సులతో పాటు పల్లె వెలుగులో ప్రయాణించే వారికి భారీ రాయితీలు తీసుకొని వచ్చింది.
గ్రామీణ, పట్టణప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో వెళ్లే సీనియర్ సిటిజన్లకు టికెట్ ధరలో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే హైదరాబాద్ నగరంలో 24 గంటల పాటు అన్‌లిమిటెడ్ జర్నీకి రూ.120 ఉన్న టికెట్‌ను రూ.75కే ఇవ్వనున్నది. ఇక పిల్లలకు టీ-24 టికెట్‌ను కేవలం రూ.50కే అందజేయనున్నట్లు ప్రకటించింది. స్వాతంత్ర దినోత్సవం అయిన ఆగస్టు 15న ఒక్క రోజు మాత్రమే ఈ రాయితీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని యాజమాన్యం తెలియజేసింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ. సజ్జనార్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం సిటీ బస్సుల్లో టీ-24 టికెట్ రూ.120గా, సీనియర్ సిటిజన్లు, మహిళలకు రూ.100గా ఉన్నది. ఇక 12 ఏళ్ల లోపు పిల్లలకు రూ.80తో ఈ టికెట్ లభిస్తోంది. అయితే స్వాతంత్ర దినోత్సవం రోజు ఈ టికెట్ కేవలం రూ.75కే అందరికీ లభించనున్నది. పిల్లకు రూ.50 మాత్రమే వసూలు చేస్తారు. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో ఎంత దూరానికి అయినా, ఎన్ని సార్లు అయినా సీనియర్ సిటిజర్లు 50 శాతం రాయితీతో టికెట్లు పొందవచ్చు అని యాజమాన్యం తెలిపింది.
పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లు తమ వెంట వయసు ధ్రువీకరణ పత్రాలను ఉంచుకోవాలని.. ఆధార్ లేదా పాన్ కార్డు కండక్టర్‌కు చూపించి రాయితీని పొందవచ్చని యాజమాన్యం పేర్కొన్నది. ఆగస్టు 15 భారతీయులందరికీ పండుగ రోజు. మన దేశ చరిత్రలో అదొక మైలురాయి. వేలాది మంది అమరవీరుల త్యాగం ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం సిద్ధించిన ఆ శుభ దినాన ప్రయాణికులకు ఈ ప్రత్యేక రాయితీలు ప్రకటించామని సజ్జనార్ పేర్కొన్నారు. డిస్కౌంట్లు, రాయితీ టికెట్లపై మరిన్ని వివరాల కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని వారు సూచించారు.