పురుషులపై టీఎస్ ఆర్టీసీ కరుణ.. ప్రత్యేక బస్సులు ఏర్పాటు
తాజాగా హైదరాబాద్ లోని ఎల్బీనగర్ - ఇబ్రహీంపట్నం మార్గంలో 'పురుషులకు మాత్రమే' అనే బోర్డుతో ఓ ఆర్టీసీ బస్సు దర్శనమిచ్చింది. దీంతో పురుష ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.
పురుషుల పట్ల టీఎస్ ఆర్టీసీ ఎట్టకేలకు కరుణ చూపింది. పురుషుల కోసం ప్రత్యేకంగా బస్సుల ఏర్పాటును ప్రారంభించింది. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ అని ప్రభుత్వం ప్రకటించడంతో మహిళలు ఆ బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. పురుష ప్రయాణికులకు అసలు సీట్లు దొరకడం లేదు. నిల్చుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఎట్టకేలకు మగాళ్ళ మొర ఆలకించిన టీఎస్ ఆర్టీసీ, పురుషుల కోసం ప్రత్యేకంగా బస్సులను తిప్పడం ప్రారంభించింది.
తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించింది. గత ఏడాది డిసెంబర్ 9న ఈ పథకం ప్రారంభమైంది. మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది.
పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో గుర్తింపు కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం మొదలైనప్పటి నుంచి మహిళలు ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించడం మానేసి ఆర్టీసీ బస్సును ఎంచుకుంటున్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజుకు 12 నుంచి 14 లక్షలు ఉండగా.. ప్రస్తుతం వారి సంఖ్య 30 లక్షలు దాటినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
ప్రయాణం ఉచితం కావడంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరిగింది. పురుషులకు కూర్చోవడానికి సీట్లు కూడా దొరకడం లేదు. ఎక్కడికి వెళ్లాలన్న నిలబడే ప్రయాణించాల్సి వస్తోంది. దీనిపై పురుష ప్రయాణికులు పలు సందర్భాల్లో నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో తమ కోసం ప్రత్యేకంగా కొన్ని సీట్లు రిజర్వ్ చేయాలని, లేకపోతే పురుషుల కోసం ప్రత్యేకంగా బస్సులు తిప్పాలని ప్రభుత్వానికి విన్నవించారు.
మహిళలకు ఉచిత ప్రయాణం రద్దు చేయాలని ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయమై ఆర్టీసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్ లోని ఎల్బీనగర్ - ఇబ్రహీంపట్నం మార్గంలో 'పురుషులకు మాత్రమే' అనే బోర్డుతో ఓ ఆర్టీసీ బస్సు దర్శనమిచ్చింది. దీంతో పురుష ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు టీఎస్ ఆర్టీసీ తమ బాధ గుర్తించిందని వ్యాఖ్యానిస్తున్నారు.
ట్రయల్ రన్ లో భాగంగా పురుషుల కోసం ముందుగా ఇబ్రహీంపట్నం డిపో నుంచి ప్రత్యేకంగా ఓ బస్సు నడిపినట్లు తెలుస్తోంది. పురుష ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పురుషుల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.