TSRTC గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ మొదలు..
పండగ సీజన్ ని మిస్ చేసుకోకుండా, సిబ్బందికి కూడా అదనపు ఆదాయం వచ్చేలాగా ప్లాన్ చేసింది యాజమాన్యం.
పండగ సీజన్లో అదనపు ఆదాయం సమకూర్చుకోడానికి 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసిన TSRTC గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ మొదలు పెట్టింది. ఆదివారం నుంచి ఈ ఛాలెంజ్ మొదలైంది. ఇందులో భాగంగా ప్రతి రోజు అదనపు సర్వీసుల్ని నడుపుతోంది ఆర్టీసీ. రోజుకి లక్ష కిలోమీటర్ల మేర అదనపు సర్వీసులు కవర్ చేయాల్సి ఉంటుంది.
సెలవలు రద్దు..
సిబ్బంది కొరతతో ఇప్పటికే ఉన్నవారికి సెలవల విషయంలో వెసులుబాటు దొరకడంలేదు. అందులోనూ పండగ సందర్భాల్లో సిబ్బంది కొరత మరింత ఇబ్బంది పెడుతుంది. అయితే వీక్లీఆఫ్ లు, సీఆఫ్ లు లేకుండా పనిచేస్తే క్యాష్ అవార్డులు ఇవ్వడానికి ఆర్టీసీ సిద్ధపడింది. పండగ సీజన్ ని మిస్ చేసుకోకుండా, సిబ్బందికి కూడా అదనపు ఆదాయం వచ్చేలాగా ప్లాన్ చేసింది యాజమాన్యం.
ప్రస్తుతం రాష్ట్రంలో బస్సులు సగటున రోజుకు 32.21 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. ఇక నుంచి రోజుకు మరో లక్ష కిలోమీటర్ల దూరం అదనంగా నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. బతుకమ్మ, దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఇలా వరుస పండుగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలను దృష్టిలో పెట్టుకుని జనవరి 22 వరకు అదనపు సర్వీసుల్ని నడపబోతున్నారు. వీటి ద్వారా ప్రతిరోజు అదనంగా రూ.1.64 కోట్లు అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని ఆర్టీసీ టార్గెట్ పెట్టుకుంది.
100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ తో మొత్తంగా రూ.164 కోట్ల అదనపు ఆదాయం రాబట్టాలనేది ఆర్టీసీ ప్రణాళిక. ఇదివరకు రాఖీ ఇతర పండగల సందర్భంగా ఆర్టీసీ వ్యూహం బ్రహ్మాండంగా పనిచేసింది. ఇప్పుడు కూడా అదే వ్యూహంతో ముందుకెళ్తోంది. సిబ్బంది సహకారంతో అదనపు ఆదాయం సమకూర్చుకోడానికి సిద్ధపడింది. అదే సమయంలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించబోతోంది ఆర్టీసీ.