Telugu Global
Telangana

దసరా స్పెషల్ బస్.. బాదుడు మాత్రం లేదు

ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ tsrtconline.in లో చేసుకోవాలని కోరారు సజ్జనార్. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.

దసరా స్పెషల్ బస్.. బాదుడు మాత్రం లేదు
X

పండగ ప్రయాణాలంటే సామాన్యులు హడలెత్తిపోతారు. వ్యక్తిగత వాహనాలు లేనివారికి ప్రజా రవాణాయే దిక్కు. రద్దీ కారణంగా ఆర్డినరీ బస్సుల్లోనే లగ్జరీ చార్జీలు వసూలు చేసే పరిస్థితి. తిరుగు ప్రయాణాల విషయంలో ఈ వ్యవహారం మరింత ఇబ్బందిగా ఉంటుంది. డబుల్ చార్జీతో బాదిపడేసే అనుభవాలు కోకొల్లలు. కానీ, ఈ దసరాకి ప్రత్యేక బస్సుల్లో ఒక్క రూపాయి కూడా అదనంగా చార్జీ వసూలు చేయబోమని హామీ ఇచ్చారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. దసరా సందర్భంగా 5,265 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ప్రకటించారు.

12రోజులు, 5,265 స్పెషల్ బస్సులు..

రోజువారీ బస్సులతోపాటు అదనంగా దసరా సీజన్లో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 25 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. 5,265 ప్రత్యేక బస్సులలో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కూడా కల్పించారు. 22న సద్దుల బతుకమ్మ, 23న మహర్ణవమి, 24న దసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని ప్రత్యేక బస్సులను నడుపుతారు. గత దసరా కంటే ఈసారి దాదాపు 1,000 బస్సులను అదనంగా నడుపుతున్నట్టు సజ్జనార్ ప్రకటించారు. అంటే గతేడాదితో పోల్చి చూస్తే ఈఏడాది 20శాతం అదనం అన్నమాట.

హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర లకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. పండగ రోజుల్లో ఎంజీబీఎస్-ఉప్పల్, ఎంజీబీఎస్-జేబీఎస్, ఎంజీబీఎస్-ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సు అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి 23 వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెగ్యులర్, స్పెషల్ సర్వీసులను ఎంజీబీఎస్ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి నడపాలని సంస్థ నిర్ణయించింది.

ఏపీలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి బయలుదేరుతాయి.

ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపు వేళ్లే బస్సులు జేబీఎస్, పికెట్ నుంచి వెళ్తాయి.

వరంగల్, హన్మకొండ, జనగామ, పరకాల, నర్సంపేట, మహబుబాబాద్, తొర్రూరు, యాదగిరిగుట్ట బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్ నుంచి బయలుదేరుతాయి.

విజయవాడ, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం బస్సులు ఎల్బీనగర్ నుంచి బయలుదేరుతాయి.

మిగతా సర్వీసులు యథావిధిగా ఎంజీబీఎస్ నుంచే నడుస్తాయని ఆర్టీసీ ప్రకటించింది.

ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ tsrtconline.inలో చేసుకోవాలని కోరారు సజ్జనార్. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.

*

First Published:  2 Oct 2023 8:12 AM IST
Next Story