Telugu Global
Telangana

టీఎస్ఆర్టీసీలో ఆ రెండు టికెట్లు రద్దు..

ఫ్యామిలి-24, టి-6 టికెట్లు జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డుల్ని కండక్టర్లు చూడాల్సి ఉంటుంది. వారి వయసు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బస్సుల్లో మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ దశలో ఫ్యామిలి-24, టి-6 టికెట్ల జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతుంది.

టీఎస్ఆర్టీసీలో ఆ రెండు టికెట్లు రద్దు..
X

తెలంగాణ ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు, బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెంచేందుకు ఇటీవల కొత్త కొత్త పథకాలు ప్రవేశ పెట్టారు. అయితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత రవాణా మొదలయ్యాక ఆ పథకాలన్నీ మూలనపడ్డాయి. మహిళలందరికీ ఉచిత ప్రయాణం అన్న తర్వాత ఇక రాయితీలతో ఉపయోగం ఏముంటుంది. అందుకే ఫ్యామిలి-24, టి-6 టికెట్లు ఇప్పుడు అడిగేవారే లేకుండా పోయారు. ఒకవేళ ఎవరైనా అడిగినా కండక్టర్లకు ఆ టికెట్లను ఇవ్వడం, వాటిని సరిచూసుకోవడం కష్టసాధ్యంగా మారింది. అందుకే ఆ రెండు టికెట్లను క్యాన్సిల్ చేస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.


ఫ్యామిలి-24 టికెట్.. నలుగురు కుటుంబ సభ్యులున్న వారికి ఉపయోగం. వారిలో మహిళలు ఉంటే ఈ టికెట్ కంటే సాధారణ టికెట్లే వారికి లాభం. ఇక టి-6 విషయానికొస్తే ఇది మహిళలు, వృద్ధులకోసం ప్రవేశపెట్టారు. మహిళలకు ఎలాగూ ఉచిత ప్రయాణం ఉంది. ఇక వృద్ధుల వయసు నమోదు చేసుకోవడం, వారికి టికెట్ ఇవ్వడం, ఆ తర్వాతి సర్వీసుల్లో వారి టికెట్ సరిచూడటం.. ఇవన్నీ కండక్టర్లకు తలనొప్పిగా మారాయి. ఫ్యామిలి-24, టి-6 టికెట్లు జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డుల్ని కండక్టర్లు చూడాల్సి ఉంటుంది. వారి వయసు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బస్సుల్లో మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ దశలో ఫ్యామిలి-24, టి-6 టికెట్ల జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతుంది. అందుకే ఆ రెండిట్నీ ఉపసంహరించుకుంటున్నట్టు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.

జనవరి 1 నుంచి ఫ్యామిలి-24, టి-6 టికెట్ల జారీని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. మహాలక్ష్మి స్కీమ్‌ ప్రవేశ పెట్టిన తర్వాత ఆర్టీసీ బస్సులు మహిళా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయని తెలిపారాయన. ఆక్యుపెన్సీ రేషియా 100 శాతం నమోదవుతోందన్నారు. మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఆర్టీసీకి ఆదాయం పెరిగిందనే అనుకోవాలి. అయితే వారికిచ్చే ఉచిత టికెట్ల రాయితీని ప్రభుత్వం క్రమం తప్పకుండా చెల్లించినప్పుడే ఆ ఫలితాలను ఆర్టీసీ అందుకోగలదు.

First Published:  31 Dec 2023 11:39 AM IST
Next Story