తెలంగాణ ఆర్టీసీ బిల్లుకి గవర్నర్ ఆమోదం
ఆర్టీసీ విలీన బిల్లుని తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన నెలరోజుల తర్వాత దానిపై గవర్నర్ ఆమోద ముద్ర పడటం విశేషం.
ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బందిని విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేశారు. తాను చేసిన 10 సిఫారసుల విషయంలో ప్రభుత్వ స్పందనపై సంతృప్తి చెందిన గవర్నర్ ఆ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ అభినందనలు తెలిపారు.
నెలరోజుల తర్వాత..
ఆర్టీసీ విలీన బిల్లుని తెలంగాణ అసెంబ్లీt ఆమోదించిన నెలరోజుల తర్వాత దానిపై గవర్నర్ ఆమోద ముద్ర పడటం విశేషం. మొదటినుంచీ ఈ బిల్లు ఆమోదం విషయంలో ఉత్కంఠ నెలకొల్పింది. డ్రాఫ్ట్ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశ పెట్టేముందుగా గవర్నర్ ఆమోదం కోసం పంపించారు. అప్పుడు కూడా గవర్నర్ బిల్లుని కొన్నిరోజులపాటు ఆపారు. చివరకు ఉద్యోగుల ఆందోళనలతో ఆమె కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అసెంబ్లీకి పంపించారు. 10 సవరణలు సూచించారు.
అసెంబ్లీ ఆమోదం తర్వాత ఆర్టీసీ బిల్లు తిరిగి రాజ్ భవన్ కి చేరుకున్నా, నెలరోజులపాటు ఆమోదం విషయంలో ఉత్కంఠ కొనసాగింది. బిల్లుని న్యాయశాఖకు పంపించడం, అది తిరిగిరావడం, ఆ తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు మరోసారి గవర్నర్ కి విజ్ఞప్తి చేయడం.. ఇలా ఈ ఎపిసోడ్ కొనసాగింది. ఎట్టకేలకు ఆ ఎపిసోడ్ సుఖాంతం అయింది. గవర్నర్ బిల్లుకి ఆమోద ముద్ర వేయడంతో అది చట్టంగా మారింది. ఇకనుంచి తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయినట్టే లెక్క. అక్టోబర్-1నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బంది జీతాలు తీసుకోబోతున్నారు.