తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్
ఆక్యుపెన్సీ రేషియో (OR) విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రికార్డు సృష్టించింది. రాఖీ పండగ రోజు కూడా సెలవు తీసుకోకుండా సంస్థ కోసం పనిచేసిన సిబ్బందిని యాజమాన్యం అభినందించింది.
తెలంగాణ ఆర్టీసీ రికార్డుల మోత మోగించింది. ఆదాయంలో ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. అది కూడా సోమవారం కాకపోవడం విశేషం. సహజంగా సోమవారం ఆర్టీసీ ఆదాయం అధికంగా ఉంటుంది. కానీ ఈసారి గురువారం రోజు ఆర్టీసీ చరిత్రలోనే రికార్డ్ స్థాయి ఆదాయం వచ్చింది.
రికార్డు ఎలా..?
రాఖీ పౌర్ణమి నేపథ్యంలో గురువారం ఒక్కరోజే తెలంగాణ ఆర్టీసీకి రూ.22.65 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మేరకు TSRTC అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది రాఖీ పండగ రోజున రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈ సారి దాదాపు కోటి రూపాయలు అదనంగా లభించడం విశేషం. ప్రయాణికుల సంఖ్య కూడా గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది లక్ష వరకు పెరిగింది. గతేడాది రాఖీ రోజున 39.90 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయగా ఈ ఏడాది రాఖీ పండగ రోజున 40.91లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు తీసుకున్నారు. ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
రాఖీ పౌర్ణమి పర్వదినం నాడు #TSRTC సరికొత్త రికార్డులను నమోదు చేసింది. నిన్న ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు. గత ఏడాది రాఖీ పండుగ(12.08.2022) నాడు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈ సారి దాదాపు రూ.కోటి వరకు అదనంగా ఆర్జించింది. ఈ…
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) September 1, 2023
నల్గొండ ప్రత్యేకత..
ఆక్యుపెన్సీ రేషియో (OR) విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రికార్డు సృష్టించింది. నల్గొండ జిల్లాలో రాఖీ పండగ రోజున OR 104.68 శాతంగా నమోదయింది. నార్కట్ పల్లి డిపో మినహా మిగతా 6 డిపోల్లో OR 100శాతం దాటింది. వరంగల్, మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రాఖీ పండగ రోజు కూడా సెలవు తీసుకోకుండా సంస్థ కోసం పనిచేసిన సిబ్బందిని యాజమాన్యం అభినందించింది.
ఇక తెలంగాణ ఆర్టీసీ, రాఖీ సందర్భంగా ఆగస్ట్ 30, 31 తేదీల్లో ప్రయాణించినవారి వివరాలు సేకరించింది. లక్కీ డ్రా నిర్వహించి 33 మంది మహిళా ప్రయాణికులకు రూ.5.50 లక్షల విలువైన బహుమతులు అందిస్తామని తెలిపింది. ఈనెల 9లోగా లక్కీ డ్రా నిర్వహించి విజేతలను ప్రకటిస్తారు.
♦