గ్రూప్-1 రద్దు వ్యవహారంలో TSPSC కీలక నిర్ణయం
మరోసారి ప్రిలిమినరీ పరీక్ష అంటే లక్షల మంది అభ్యర్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతారని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. న్యాయనిపుణులతో సమావేశమై సలహాలు తీసుకున్నారు అధికారులు.
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్దు కావడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మొదటిసారి రద్దు తర్వాత రెండోసారి పరీక్షకు దాదాపు 50వేలమంది హాజరు కాలేదు, ఇప్పుడు మూడోసారి పరీక్ష రద్దు అంటే మరింతమంది నిరాశతో వెనకడుగు వేసే ప్రమాదం ఉంది. మరికొందరు ఇతర సమస్యలతో పరీక్షకు దూరంగా ఉంటారు. ఏరకంగా చూసుకున్నా ఇది ఉద్యోగార్థులకు ఇబ్బందికర పరిస్థితి అందుకే TSPSC ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేయడానికి సిద్ధపడింది.
మరోసారి ప్రిలిమినరీ పరీక్ష అంటే లక్షల మంది అభ్యర్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతారని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ కు అప్పీలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే న్యాయనిపుణులతో సమావేశమై సలహాలు తీసుకున్నారు అధికారులు. పూర్తి వివరాలతో రేపు అప్పీలు దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తోంది.
పరీక్ష-వివాదాల క్రమం..
2022 ఏప్రిల్ 26న 503 పోస్టులతో తెలంగాణలో తొలి గ్రూప్-1 ప్రకటన విడుదలైంది.
తొలిదశలో 3,80,202 మంది దరఖాస్తు చేశారు.
2022 అక్టోబరు 16న ప్రిలిమ్స్ పరీక్షకు 2,85,916 మంది హాజరయ్యారు.
ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది.
2023 జూన్ 11న రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించారు.
52వేలమంది గైర్హాజరు. 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని తాజాగా హైకోర్టు తీర్పునిచ్చింది.
జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో బయో మెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని TSPSCకి ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఈ తీర్పుపై TSPSC డివిజన్ బెంచ్ కు వెళ్తోంది.