ఓఎంఆర్ కి స్వస్తి.. ఇకపై అంతా కంప్యూటర్ పరీక్షలే..!
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించాలంటే ముందుగానే పేపర్ తయారు చేయాల్సిన అవసరం లేదు. రోజుల ముందు క్వశ్చన్ పేపర్ ని ఫైనల్ చేయొచ్చు. అది లీకయ్యే అవకాశం చాలా తక్కువ.
TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా ఎంత అలజడి సృష్టించిందో చూస్తూనే ఉన్నాం. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఆరోపణలు, గవర్నర్ జోక్యం, సిట్ కి పోటీగా సీబీఐ ఎంక్వయిరీకి పెరుగుతున్న డిమాండ్.. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో TSPSC భవిష్యత్తులో జరపాల్సిన పరీక్షల నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై OMR కి స్వస్తి పలకాలని బోర్డ్ భావిస్తున్నట్టు సమాచారం.
ఇకపై అన్నీ CBT పద్ధతిలోనే..
OMR ఆన్సర్ షీట్ పై బబ్లింగ్ విధానం పాత పద్ధతే అయినా దానివల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఒకేసారి అభ్యర్థులందరికీ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఆరోపణలు వస్తే, OMR షీట్లను సరిచూసే చేసే సౌకర్యం కూడా ఉంటుంది. పరీక్ష పేపర్ దిద్దడం కూడా సులువు. అందుకే OMR పై ఇప్పటికీ ఎగ్జామ్ బోర్డ్ లు ఎక్కువగా ఆధారపడుతుంటాయి. కానీ ఇప్పుడు పేపర్ లీకేజీతో పెద్ద తప్పు జరిగింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. డబ్బుకు అమ్ముడుపోయేవారు ఉన్నంతకాలం లీకేజీకి చెక్ పెట్టడం కష్టమనే చెప్పాలి. అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) అయితే ఇలాంటి లీకేజీలను దాదాపుగా అరికట్టవచ్చని అంటున్నారు.
OMR పద్ధతిలో పరీక్ష అంటే రెండు నెలల ముందుగా పేపర్ తయారు చేయాలి, దాన్ని ప్రింటింగ్ కి పంపించాలి. పగడ్బందీ ఏర్పాట్లు చేయాలి. ఈలోపు ఎక్కడైనా లీకేజీకి అవకాశముంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించాలంటే ముందుగానే పేపర్ తయారు చేయాల్సిన అవసరం లేదు. రోజుల ముందు క్వశ్చన్ పేపర్ ని ఫైనల్ చేయొచ్చు. అది లీకయ్యే అవకాశం చాలా తక్కువ. సర్వర్ సిస్టమ్ ని హ్యాక్ చేస్తే మాత్రం సమస్య మళ్లీ మొదటికొచ్చినట్టే.
కష్టనష్టాలు..
CBT విధానం అన్నిరకాల మేలయినా.. దానికి తగినన్ని కంప్యూటర్లు అవసరం. లక్షమంది విద్యార్థులకు ఒకేరోజు పరీక్ష పెట్టాలంటే కష్టసాధ్యం. అందుకే విడతల వారీగా పరీక్షలు పెడుతుంటారు. జేఈఈ అడ్వాన్స్డ్ , మెయిన్స్ , నీట్ పరీక్షలు ఇదే తరహాలో నిర్వహిస్తున్నారు. మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పేపర్ లీకేజీకి చెక్ పెట్టాలనుకుంటున్నారు బోర్డ్ అధికారులు. ప్రస్తుతం TSPSC ఈ కొత్త విధానంవైపే మొగ్గు చూపుతోంది. ఇకపై జరగబోయే అన్ని పరీక్షలను కంప్యూటర్లతోనే నిర్వహించాలనుకుంటున్నారు. ప్రస్తుత పేపర్ లీకేజీ గందరగోళం తొలగిపోతే దీనిపై అధికారిక ప్రకటన విడుదలవుతుంది.