Telugu Global
Telangana

పుకార్లు నమ్మొద్దంటున్న TSPSC చైర్మన్.. నివేదిక కోరిన గవర్నర్

ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురు ఉద్యోగులు ఉన్నట్టు తేలిందని వారిని ఉద్యోగాలనుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. పూర్తి స్థాయి నివేదిక రావాలన్నారు చైర్మన్ జనార్దన్ రెడ్డి.

పుకార్లు నమ్మొద్దంటున్న TSPSC చైర్మన్.. నివేదిక కోరిన గవర్నర్
X

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో మొత్తం 9మందిని పోలీసులు అరెస్ట్ చేశారు, వారికి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. అయితే ఇది లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన విషయం.


TSPSCలో జరిగిన అక్రమాల వల్ల ఇటీవల పోటీ పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. అసలు ఏయే పేపర్లు లీకయ్యాయి అనే విషయం తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంలో పుకార్లు నమ్మొద్దని, ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని హామీ ఇస్తున్నారు TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి. పరీక్షల రద్దు వ్యవహారంపై న్యాయ నిపుణుల సలహా ప్రకారం ముందుకెళ్తామన్నారాయన.

రాజశేఖర్‌ రెడ్డి అనే నెట్‌ వర్క్‌ ఎక్స్ పర్ట్ ఏడేళ్ల నుంచి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా TSPSCలో పనిచేస్తున్నాడని, అతని వల్లే ఇదంతా జరిగిందని, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్ సహాయంతో పేపర్ లీకేజీ జరిగిందని చెప్పారు చైర్మన్ జనార్దన్ రెడ్డి. ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురు ఉద్యోగులు ఉన్నట్టు తేలిందని వారిని ఉద్యోగాలనుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. పూర్తి స్థాయి నివేదిక రావాలన్నారాయన.

TSPSC పేపర్ లీకేజీ ఘటనపై గవర్నర్‌ తమిళిసై స్పందించారు. 48గంటల్లో నివేదిక ఇవ్వాలని TSPSCని ఆదేశించారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు ప్రతిపాదించాలని సూచించారు. మరో వైపు TSPSCలో పేపర్‌ లీకేజీ కేసును సిట్‌ కు బదిలీ చేస్తూ హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

First Published:  14 March 2023 9:43 PM IST
Next Story