Telugu Global
Telangana

TSPSC లీకేజీ కేసులో ఈడీ విచారణ మొదలు

విదేశాలనుంచి కొంతమంది వచ్చి పరీక్షలు రాయడంతో మనీలాండరింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కోట్లాది రూపాయలు చేతులు మారాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ రంగంలోకి దిగింది.

TSPSC లీకేజీ కేసులో ఈడీ విచారణ మొదలు
X

TSPSC పేపర్ లీకేజీ కేసులో ఇప్పటికే సిట్ దర్యాప్తు జరుగుతోంది. ఇప్పుడు తాజాగా ఈడీ రంగంలోకి దిగింది. పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి వద్ద వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ ముందుగానే బయటకు వచ్చిందని, విదేశాల నుంచి వచ్చి కొంతమంది పరీక్షలు రాశారన్న ఆరోపణలపై ఈడీ విచారణ ప్రారంభించింది.

ఈడీ ఎందుకు..?

పేపర్ లీకేజీతో ఈడీకి అస్సలు సంబంధమే లేదు. అయితే విదేశాలనుంచి కొంతమంది వచ్చి పరీక్షలు రాయడంతో మనీలాండరింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కోట్లాది రూపాయలు చేతులు మారాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ రంగంలోకి దిగింది.

TSPSCలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్టోడియన్ గా ఉన్న శంకర లక్ష్మి కంప్యూటర్ నుంచి ప్రశ్నపత్రం లీక్ అయిందనే అనుమానం కూడా ఉంది. అయితే సిట్ ఆమెను సాక్షిగా పేర్కొంది. కానీ ఈడీ మాత్రం శంకర లక్ష్మికి నోటీసులిచ్చింది. బుధ, గురువారాల్లో ఆమెను విచారణకు రావాలని ఈడీ నోటీసులో పేర్కొంది.

కీలకంగా మారిన FSL నివేదిక..

TSPSC లీకేజీ వ్యవహారంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక కీలకంగా మారింది. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక నుంచి సీజ్ చేసిన సెల్‌ ఫోన్లను FSLకు సిట్ అధికారులు పంపించారు. కంప్యూటర్, ల్యాప్ టాప్ లను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. ఈ నివేదిక కూడా పోలీసులకు చేరింది. ఈ వ్యవహారంలో ఈనెల 11న కేసు నివేదికను సిట్, కోర్టుకి సమర్పించాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని చంచల్‌ గూడ జైలులో ఉంచారు. వారిని కస్టడీలోకి తీసుకుని కీలక విషయాలు రాబట్టారు.

First Published:  11 April 2023 11:51 AM IST
Next Story