TSPSCలో సంస్కరణలు.. సెల్ ఫోన్, పెన్ డ్రైవ్ కి నో ఎంట్రీ
ఉద్యోగులు కూడా మొబైల్ ఫోన్లను కార్యాలయం బయటే ఉంచి రావాలని, దానికోసం ఫ్రంట్ ఆఫీస్ లో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లు లోపలికి తేకూడదని నిర్ణయం తీసుకున్నారు.
ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంతో TSPSC అలర్ట్ అయింది. మారుతున్న టెక్నాలజీ వల్లే పేపర్ లీకేజీ సాధ్యమైందని, అందుకే ఆఫీస్ వ్యవహారాల్లో మరింత కఠినంగా ఉండాలనే నిర్ణయం తీసుకుంది. చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి నేతృత్వంలో కమిషన్ సభ్యులు సమావేశమై కొత్త సంస్కరణల గురించి చర్చించారు. త్వరలో ఈ నిబంధనలు అమలులోకి వచ్చేలా చర్యలు చేపట్టబోతున్నారు.
సెల్ ఫోన్, పెన్ డ్రైవ్ కి నో ఎంట్రీ..
పేపర్ లీకేజీ వ్యవహారంలో పెన్ డ్రైవ్ పాత్ర కీలకం కావడంతో.. ఇకపై TSPSC కార్యాలయంలోకి పెన్ డ్రైవ్ లకు అనుమతి లేదని తేల్చేశారు అధికారులు. ఉద్యోగులు కూడా మొబైల్ ఫోన్లను కార్యాలయం బయటే ఉంచి రావాలని, దానికోసం ఫ్రంట్ ఆఫీస్ లో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లు లోపలికి తేకూడదని నిర్ణయం తీసుకున్నారు.
పరీక్షలన్నీ ఆన్ లైన్ లోనే..
ఇకపై TSPSC నిర్వహించే పరీక్షలన్నీ ఆన్ లైన్లోనే పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ప్రస్తుతానికి సాధ్యమైనన్ని పరీక్షలు ఆన్ లైన్లో నిర్వహించాలని, భవిష్యత్తులో జరగబోయే పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) లుగానే ఉండాలని తీర్మానించారు. TSPSC లో ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక విధానం రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. అన్ని విశ్వవిద్యాలయాలు, శాఖలు కమిషన్ సూచనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. TSPSC బిల్లులను క్లియర్ చేయడానికి ఆర్థికశాఖలో గ్రీన్ చానల్ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయబోతున్నారు. ఇకపై అభ్యర్థులు నేరుగా ఆఫీసుకు వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం ఉండకూడదని, ఆన్ లైన్ లో లేదా ఫ్రంట్ ఆఫీసులోనే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు.