టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్.. గవర్నర్ వద్ద ఫైల్
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికోసం మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళణ చేస్తామని ఎన్నికల ముందే ప్రకటించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. చైర్మన్ సహా సభ్యులంతా ఇప్పటికే రాజీనామాలు చేయగా.. కొత్త చైర్మన్ నియామకం ఓ కొలిక్కి వచ్చింది. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. ఆ ఫైల్ పై గవర్నర్ ఆమోదముద్ర పడితే టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు.
ముగ్గురి పేర్లు పరిశీలన..
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికోసం మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించింది. ఆ ముగ్గురి పేర్లను గవర్నర్ వద్దకు పంపించింది. వారిలో మహేందర్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నట్లు సమాచారం. ఛైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకోగా.. ఆ దరఖాస్తులను పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేశారు. ఆ ఫైల్ ని గవర్నర్ ఆమోదం కోసం పంపించారు.
ఛైర్మన్ పదవికోసం మహేందర్‌రెడ్డితో పాటు మరో రిటైర్డ్ ఆఫీసర్, రెండు నెలల్లో పదవీ విరమణ చేయబోతున్న మరో ఐపీఎస్ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. వీరిలో మహేందర్‌రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన నియామకానికే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ గతంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలు ఇదే విషయాన్ని హైలైట్ చేసి లబ్ధి పొందాయి. ఇప్పుడు టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఆధ్వర్యంలో పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాల్సిన అవసరం ఉంది.