Telugu Global
Telangana

టీఎస్‌పీఎస్సీ పటిష్టంగా ఉంది.. పరీక్ష కోసం మళ్లీ ఫీజు అవసరం లేదు : మంత్రి కేటీఆర్

టీఎస్‌పీఎస్సీ ద్వారా ఇప్పటి వరకు 37వేల ఉద్యోగాలకు పైగా భర్తీ చేశామని.. ఏ పరీక్షలపై కూడా ఇలాంటి ఆరోపణలు రాలేదని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

టీఎస్‌పీఎస్సీ పటిష్టంగా ఉంది.. పరీక్ష కోసం మళ్లీ ఫీజు అవసరం లేదు : మంత్రి కేటీఆర్
X

తెలంగాణలోని నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేవలం ఇద్దరు వ్యక్తుల వల్లే పేపర్ లీకేజీ జరిగిందని.. టీఎస్‌పీఎస్సీ ఎంతో పటిష్టంగా ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిరుద్యోగులు, యువత ఎలాంటి ఆందోళన చెందకుండా.. మళ్లీ పరీక్షలు రాయాలని కేటీఆర్ కోరారు. గతంలో పరీక్షల కోసం దరఖాస్తు చేసకున్న వాళ్లంతా తిరిగి పరీక్షలకు హాజరవ్వొచ్చని.. ఎలాంటి ఫీజు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. శనివారం బీఆర్కే భవన్ (తాత్కాలిక సచివాలయం)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

టీఎస్‌పీఎస్సీ ద్వారా ఇప్పటి వరకు 37వేల ఉద్యోగాలకు పైగా భర్తీ చేశామని.. ఏ పరీక్షలపై కూడా ఇలాంటి ఆరోపణలు రాలేదని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ విధానంలో 99 పరీక్షలు నిర్వహించినట్లు కేటీఆర్ చెప్పారు. ఇప్పటి వరకు నాలుగున్నర లక్షల మంది నిరుద్యోగులు పరీక్షలు రాసినట్లు మంత్రి తెలిపారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పరీక్షలు అన్నీ పూర్తి పారదర్శకతతో ఉంటాయని మంత్రి చెప్పారు. యూపీఎస్సీ చైర్మన్ కూడా రెండు సార్లు తెలంగాణలో పర్యటించి.. టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని సందర్శించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.

టీఎస్‌పీఎస్సీ అమలు చేస్తున్న విధానాన్ని, మార్పులు, చేర్పులను అధ్యయనం చేసి ఆయా రాష్ట్రాల్లో అమలు చేయడానికి 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఎంతో మంది మన టీఎస్‌పీఎస్సీ పని విధానాన్ని మెచ్చుకుంటున్నారని ఆయన తెలిపారు. దేశంలోని ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేయని విధంగా.. అత్యధికంగా ఉద్యోగ నియామక ప్రక్రియలను పూర్తి చేసిన కమిషన్‌గా టీఎస్‌పీఎస్సీ రికార్డులకు ఎక్కిన విషయాన్ని కేటీఆర్ తెలిపారు.

కేవలం తెలుగు, ఇంగ్లీషులోనే కాకుండా ఏడు భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించిన ఘనత టీఎస్‌పీఎస్సీదే అని కేటీఆర్ చెప్పారు. ఉమ్మడి ఏపీలో ఏపీపీఎస్సీ మీద కూడా అనేక ఆరోపణలు వచ్చేవి. కానీ ఎలాంటి ఆరోపణలు లేకుండానే 37వేల ఉద్యోగాల భర్తీ చేసిన రికార్డు టీఎస్‌పీఎస్సీది అని మంత్రి చెప్పారు. గతంలో ఇంటర్వ్యూల విషయంలో తప్పులు జరిగాయని వాటిని టీఎస్‌పీఎస్సీ రద్దు చేసిందని కేటీఆర్ అన్నారు. ఎలాంటి రికమెండేషన్లకు తావు లేకుండా కేవలం రాత పరీక్ష, మెరిట్ లిస్ట్ ఆధారంగా మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు కేటీఆర్ తెలిపారు.

ఇద్దరు వ్యక్తుల స్వార్థపూరిత చర్యల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వచ్చిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదసలు జరగకూడని పని.. దీనిని నివారించి ఉండాల్సింది. ఇక ఇప్పడు రాష్ట్రంలోని యువతకు ధైర్యాన్ని, భరోసాను నింపాల్సిన బాధ్యత మా అందరిపైనా ఉందని కేటీఆర్ అన్నారు. పేపర్ లీజేకీల వెనుక ప్రవీణ్ , రాజశేఖరే కాదు.. ఇంకా ఎవరు ఉన్నా తప్పకుండా కఠినంగా శిక్షిస్తామని మంత్రి చెప్పారు. ఇది వ్యవస్థ తప్పు కాదని.. కేవలం ఇద్దరు వ్యక్తుల తప్పని కేటీఆర్ స్పష్టం చేశారు.

పరీక్షలు రద్దు చేయడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు, యువత ఇబ్బందులకు గురవుతారు. ఈ విషయంలో మేం కూడా బాధపడుతున్నామని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు అనే పునాది మీదే నడిచింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎవరూ చేయని గొప్ప పని కేసీఆర్ చేశారని కేటీఆర్ చెప్పారు. స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు వచ్చేలా జోనల్ వ్యవస్థను రూపొందించి సీఎం కేసీఆర్ తెలంగాణ యువతకు మేలు చేశారని అన్నారు. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఇప్పటి వరకు జరిగిన పొరపాట్లను తప్పకుండా సరిదిద్ది.. మంచి సంస్కరణలు తీసుకొని వస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

గతంలో రద్దైన నాలుగు పరీక్షలు రాసిన వాళ్లు మళ్లీ ఎలాంటి ఫీజు చెల్లించకుండానే పరీక్షలు రాయవచ్చని.. అప్పుడు అప్లై చేసిన వారందరూ తిరిగి పరీక్షలు రాయడానికి వీలుంటుందని కేటీఆర్ చెప్పారు. వీలైనంత త్వరలోనే ఈ రద్దైన పరీక్షలు నిర్వహిస్తామని కేటీఆర్ అన్నారు. గ్రూప్-1, టీపీబీవో, డీఏవో, ఏఈఈ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని మంత్రి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టడీ సర్కిల్స్‌ను బలోపేతం చేయడమే కాకుండా.. జిల్లాల్లో రీడింగ్ రూమ్స్‌ను 24 గంటల పాటు తెరిచి ఉంచుతామని కేటీఆర్ చెప్పారు. నిరుద్యోగ యువతకు ఫ్రీ మెటీరియల్‌లో పాటు ఉచిత భోజన వసతి కూడా కల్పిస్తామని మంత్రి చెప్పారు.



First Published:  18 March 2023 3:26 PM IST
Next Story