రద్దు చేసిన గంటల వ్యవధిలోనే.. గ్రూప్ -1 కొత్త నోటిఫికేషన్
తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్ రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ ఈరోజు కీలక ప్రకటన విడుదల చేసింది.
టీఎస్‌పీఎస్సీ తాజాగా మళ్లీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. 563 పోస్టులతో మళ్లీ ప్రకటన విడుదల చేసింది. పాత నోటిఫికేషన్ రద్దు చేసిన కొద్ది గంటల్లోనే కొత్త నోటిఫికేషన్ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్ -1 నోటిఫికేషన్ వేశామని చెప్పుకోవడానికే ఇలా చేస్తున్నారా..? అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
రద్దు చేసిన కొన్ని గంటలకే
తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్ రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ ఈరోజు కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ పేర్కొన్నారు. త్వరలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. క్యాలెండర్‌లో డేట్ కూడా మారక ముందే కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు.
23 నుంచి అప్లికేషన్లు
కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌లోనే అప్లయ్ చేయాలి. మే లేదా జూన్‌లో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మెయిన్స్ నిర్వహిస్తారు.
వివాదాల జడివాన
బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఏప్రిల్ లో 503 పోస్ట్ లతో తొలుత నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్షల తర్వాత పేపర్ లీకేజీ వార్తలతో ఆ పరీక్ష రద్దయింది. ఆ తర్వాత మళ్లీ ప్రిలిమ్స్ జరిగాయి. కానీ, అటెండెన్స్, ఫింగర్ ప్రింట్స్ విషయంలో నిబంధనలు పాటించలేదని కొందరు అభ్యర్థులు కోర్టుకెక్కారు. దీంతో హైకోర్టు పరీక్ష రద్దు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఈలోగా రాష్ట్రంలో ప్రభుత్వ ప్రభుత్వం మారిపోయింది. వెంటనే ప్రభుత్వ సూచనలతో పాత నోటిఫికేషన్ ఈ రోజు రద్దు చేసింది. దాంతోపాటు 60 పోస్టుల మరో నోటిఫికేషన్‌ను కూడా కలిపి కొత్తగా 563 పోస్టులతో ఈ రోజు రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది.