Telugu Global
Telangana

గ్రూప్-4 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పెంచిన టీఎస్‌పీఎస్సీ

సమయం మించి పోవడంతో చాలా మంది దరఖాస్తు చేసుకోలేక పోయారు. దీంతో ఫిబ్రవరి 3 సాయంత్రం 5 గంటల వరకు గడువు పొడిగిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.

గ్రూప్-4 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పెంచిన టీఎస్‌పీఎస్సీ
X

గ్రూప్-4 ఉద్యోగార్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా.. అభ్యర్థులు భారీ సంఖ్యలో ఉండటంతో ఫిబ్రవరి 3 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. రాష్ట్రంలో గ్రూప్-4 కింద 8,180 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఇప్పటి వరకు 8,47,277 మంది అప్లై చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న ఒక్క రోజే 58,845 మంది ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని అన్నారు.

ఇక ఇవాళ ఆఖరి రోజు కావడంతో మరో 34,247 మంది అప్లై చేసుకున్నారు. సమయం మించి పోవడంతో చాలా మంది దరఖాస్తు చేసుకోలేక పోయారు. దీంతో ఫిబ్రవరి 3 సాయంత్రం 5 గంటల వరకు గడువు పొడిగిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అధికారులు అంచనా వేసిన దాని కంటే భారీగా ఉద్యోగాల కోసం స్పందన వస్తోంది. దీంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగి ఫామ్ పూర్తి చేసిన తర్వాత ఫీజు చెల్లించడంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి.

ఈ విషయాన్ని పలువురు టీఎస్‌పీఎస్సీ దృష్టికి తీసుకొని వెళ్లడంతోనే దరఖాస్తు గడువు పెంచినట్లు తెలుస్తున్నది. అభ్యర్థులు తొందర పడకుండా తప్పులు లేకుండా దరఖాస్తులు నింపుకోవాలని అధికారులు సూచించారు. ఫీజు చెల్లింపునకు సంబంధించిన ఓటీపీ ఆలస్యం అయినా కాస్త వేచి చూడాలని అన్నారు. ఫీజు చెల్లించినట్లు మెసేజ్ వెంటనే రాకపోయినా ఆందోళన చెందవద్దని.. సర్వర్‌పై భారం ఉండటం వల్లే అలా జరుగుతోందని అధికారులు చెప్పారు.

మరోవైపు తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు సైట్లో స్టాఫ్ నర్స్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓటీపీ రావడంలో కాస్త జాప్యం జరుగుతుండటంతో అభ్యర్థులు బోర్డు దృష్టికి తీసుకొని వెళ్లారు. అయితే, ఒక్కోసారి ఆలస్యం అయినా.. ఓటీపీలు వస్తున్నాయని అధికారులు వివరణ ఇచ్చారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నారు.

First Published:  30 Jan 2023 1:51 PM GMT
Next Story