టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల షెడ్యూల్‌లో నో ఛేంజ్.. - ప్రశ్నపత్రాలే మారుతాయ్.. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్
ఏఈ పరీక్షపై మంగళవారం సాయంత్రం సమావేశమై నిర్ణయం తీసుకోవాలని భావించినప్పటికీ పోలీసుల నివేదిక రావడంలో ఆలస్యమైందని చైర్మన్ వివరించారు.
టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల షెడ్యూలులో మార్పు లేదని చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి వెల్లడించారు. ఇకనుంచి జరిగే అన్ని పరీక్షలకూ కొత్త ప్రశ్నపత్రాలు రూపొందిస్తామని ఆయన తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూలు ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చైర్మన్ మంగళవారం చెప్పారు. ఏప్రిల్ 4 నుంచి జరిగే పరీక్షలన్నీ షెడ్యూలు ప్రకారం జరుగుతాయని ఆయన తెలిపారు.
ఏఈ పరీక్షపై మంగళవారం సాయంత్రం సమావేశమై నిర్ణయం తీసుకోవాలని భావించినప్పటికీ పోలీసుల నివేదిక రావడంలో ఆలస్యమైందని చైర్మన్ వివరించారు. దీనిపై కమిషన్ బుధవారం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు, కమిషన్ కార్యాలయ ఉద్యోగి ప్రవీణ్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాశాడని, పరీక్ష రాసేందుకు కమిషన్ నుంచి అనుమతి తీసుకున్నాడని చైర్మన్ చెప్పారు. సోషల్ మీడియాలోకి వచ్చిన అతని ఓఎంఆర్ షీట్ వివరాలను సరిచూశామని, అతనికి 103 మార్కులు వచ్చిన మాట వాస్తవమేనని చెప్పారు. అవే అత్యధిక మార్కులనడం మాత్రం వాస్తవం కాదని తెలిపారు. మెయిన్స్‌కు అతను అర్హత సాధించలేదని వెల్లడించారు. తన పిల్లలు టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు రాయలేదని చైర్మన్ స్పష్టం చేశారు. తన మేనల్లుడు రాస్తానంటే చైర్మన్ ఉద్యోగం వదిలేస్తానంటూ స్పష్టంగా చెప్పానన్నారు.
త్వరలో మరో 3 వేల పోస్టులకు నోటిఫికేషన్లు..
టీఎస్‌పీఎస్‌సీ త్వరలో మరో మూడు వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు చైర్మన్ తెలిపారు. మరో రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముందని చెప్పారు.