Telugu Global
Telangana

టీఎస్‌పీఎస్సీ కేసు.. రేణుక చుట్టూ భిగుస్తున్న ఉచ్చు

సిట్ అధికారులకు రేణుక ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో పోలిస్తే..ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం తేడాగా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

టీఎస్‌పీఎస్సీ కేసు.. రేణుక చుట్టూ భిగుస్తున్న ఉచ్చు
X

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నియమక పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ కేసులో నిందితురాలిగా ఉన్న గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు రేణుక రాథోడ్ చుట్టు ఉచ్చు భిగుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రేణుక పాత్రపై లోతుగా విచారిస్తున్నారు. సిట్ అధికారులకు రేణుక ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో పోలిస్తే..ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం తేడాగా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

ప్రశ్నపత్రాల లీక్ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్ కుమార్‌తో పాటు రేణుకను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె బెయిలుపై విడుదలయ్యారు. అయితే, ప్రవీణ్‌తో ఉన్న స్నేహం కారణంగా ఆమె ఏఈ(సివిల్) క్వశ్చన్ పేపర్‌ను సంపాదించి.. దాన్ని రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉన్న తన బంధువులకు అమ్మినట్లు సిట్ అధికారులు వాంగ్మూలంలో నమోదు చేశారు.

కాగా, రేణుక ఈ స్కామ్‌లో కీలక పాత్ర పోషించినట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు. గతంలో సిట్‌కు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో పోల్చిన ఈడీ అధికారులు.. తమ వద్ద రేణుక పలు విషయాలు దాచిపెట్టడం, సిట్ స్టేట్మెంట్‌కు విరుద్దంగా వేర్వేరు విషయాలు చెప్పడంపై ఆరా తీస్తున్నారు. సిట్ అధికారులు వారి సొంతగా స్టేట్మెంట్ రాసుకున్నారంటూ రేణుక.. ఈడీ అధికారులకు చెప్పినట్లు తెలుస్తున్నది. తాను చెప్పని విషయాలను కూడా సిట్ అధికారులే స్టేట్మెంట్‌లో రాశారని ఈడీకి చెప్పినట్లు సమాచారం.

దీంతో రేణుక ఎంత మేరకు నిజం చెప్తుందనే విషయాలను నిర్ధారణ చేసుకోవడానికి ఇతర నిందితులు, ఆమె బంధువులైన ఢాక్యా, నేనావత్ రాజేశ్వర్, ఫతావత్ గోపాల్ నాయక్‌ను తిరిగి ప్రశ్నించాలని ఈడీ భావిస్తోంది. వీరందరినీ మనీ లాండరింగ్ చట్ట ప్రకారం విచారించనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

పేపర్ లీక్ వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే టీఎస్‌పీఎస్సీ అధికారులు ఈ ఏడాది మార్చి 11న బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాన్ని ఆధారంగా చేసుకొని ఈడీ అధికారులు పీఎంఎల్ఏ చట్టం కింద పలువురిని ప్రశ్నిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జి శంకర లక్ష్మికి కూడా ఈడీ అధికారులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు.

First Published:  19 May 2023 2:59 AM GMT
Next Story