తెలంగాణలో మరో ఎన్నిక.. ఎప్పుడంటే..!
మే 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్ 5న ఫలితాలు రానున్నాయి.
వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. మే 2న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మే 9 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మే 10న నామినేషన్లు పరిశీలించనున్నారు. మే 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్ 5న ఫలితాలు రానున్నాయి.
ఉపఎన్నిక - ముఖ్య తేదీలు..
మే 2 - నోటిఫికేషన్
మే 9 - నామినేషన్ల స్వీకరణ
మే13 - నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
మే 27 - పోలింగ్
జూన్ 5 - ఫలితాలు
పల్లా రాజీనామాతో ఎన్నికలు..
వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా మండలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న..
ఈ ఉపఎన్నికకు కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించింది. జర్నలిస్టు తీన్మార్ మల్లన్నకు టికెట్ కేటాయించింది. 2021 మార్చి 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగ్గా... ఆ సమయంలో మొత్తంగా 76 మంది వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీపడ్డారు. ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న టఫ్ ఫైట్ ఇచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న మధ్య హోరాహోరీ పోరు నడవగా.. చివరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి విజేతగా నిలిచారు.