పేదల సొంతింటి కోసం.. 4 లక్షల మంది లబ్దిదారులకు రూ.7,350 కోట్లు పంపిణీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్రంలో అర్హులైన కోటి కుటుంబాలకు ఇళ్లు లేదా ఇళ్ల స్థలాల కేటాయింపుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని 1,78,200 మంది గ్రామీణ ప్రాంతాల వారికి, 2,21,800 మంది పట్టణ ప్రాంత వాసులకు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. సొంత జాగా కలిగి ఉన్న పేదలు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించుకోవడానికి ఈ ఆర్థిక సాయం అందనున్నది. ఈ పథకం ద్వారా దాదాపు 4 లక్షల మంది లబ్దిదారులకు రూ.7,350 కోట్లను ఈ ఏడాది పంపిణీ చేయనున్నది.
ఇక భూమిల లేని పేదలకు ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ధరిణి పోర్టల్‌లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు త్వరలోనే తొలగిపోతాయని ప్రభుత్వం చెబుతోంది. సోమవారం తాత్కాలిక సచివాలయ భవనం (బీఆర్కే భవన్)లో కాబినెట్ సబ్-కమిటీ మీటింగ్ జరిగింది. అందులోనే ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.
ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, చామకూరి మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, వి. శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ పాల్గొన్నారు. చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కే.రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
రాష్ట్రంలో అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసే విషయమే ఈ సబ్-కమిటీ భేటీలో చర్చకు వచ్చింది. ఇక జీవో 58, 59 అమలుకు సంబంధించిన సమస్యలపై కూడా చర్చించారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న ప్రైవేటు వ్యక్తులు, సాదాబైనామాపై ఒప్పందాలు చేసుకున్న వ్యవసాయ భూములు, నోటరైజ్ డాక్యుమెంట్ల ద్వారా ఇళ్లు కొనుగోలు, ఎండోమెంట్/వక్ఫ్ స్థలాలో భవనాల నిర్మాణం చేసిన వారికి క్రమబద్దీకరణ చేయడానికి ఉద్దేశించినవే ఈ రెండు జీవోలు. వీటిపై కూలంకషంగా చర్చ జరిపారు.
రాష్ట్రంలో అర్హులైన కోటి కుటుంబాలకు ఇళ్లు లేదా ఇళ్ల స్థలాల కేటాయింపుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. 1.25 లక్షల మంది లబ్దిదారులకు 2014లోనే పట్టాలు ఇచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు. జీవో 58 ప్రకారం ఇప్పటికే 20,685 ఇళ్ల దృవీకరణ ఇప్పటికే పూర్తయినట్లు మంత్రి చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీ, రూ.3 లక్షల ఆర్థిక సాయం విషయంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్ అధికారులకు సూచించారు.
ఇక నోటరైజ్డ్ డాక్యుమెంట్ల ద్వారా ఇళ్లను కొనుగోలు చేసిన వారు ఎక్కువగా అర్బన్ ఏరియాల్లోనే ఉన్నారని.. వీటి క్రమబద్దీకరణ నిర్ణీత సమయంలోగా జరిగేలా కార్యచరణ రూపొందించాలని మంత్రి చెప్పారు. అర్హులైన వారిలో పేదలకే ప్రాధాన్యత దక్కేలా అధికారులు చూడాలని కమిటీ సూచించింది. సాధ్యమైనంత త్వరలో ఈ లబ్దిదారులందరికీ ప్రభుత్వం తరపున సాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
పురపాలక శాఖ మంత్రి @KTRBRS అధ్యక్షతన ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ ఈరోజు బీఆర్కెఆర్ భవన్లో సమావేశమైంది. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయింపు, జీఓ 58, 59, సాదాబైనామా, నోటరీ పత్రాలు, ఎండోమెంట్/వక్ఫ్ భూములు తదితరాల అమలుపై చర్చించారు. pic.twitter.com/rfrasLaUT7
— Office of Chief Secretary, Telangana Govt. (@TelanganaCS) February 27, 2023