కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి... అసెంబ్లీ తీర్మానం
కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. మంత్రి కేటీఆర్ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా టీఆరెస్, కాంగ్రెస్, ఎమ్ ఐ ఎమ్ సభ్యులు మద్దతు ప్రకటించారు.
నిర్మాణంలో ఉన్న కొత్త పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర శాసనసభ మంగళవారం తీర్మానం చేసింది.
సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించామని అన్నారు. అంబేద్కర్ చూపిన బాటలోనే రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నడుస్తోందని, భాష, ప్రాంతం పేరుతో సాగే ఆధిపత్యాన్ని అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారని పేర్కొన్నారు.
బ్రిటీష్ పాలనలో సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్న అంబేద్కర్‌పై కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. అతను తన సమకాలీనులతో పోలిస్తే అత్యంత మేధావి అన్నారు కేటీఆర్. సామాజిక సమానత్వం లేకుండా నిజమైన స్వేచ్ఛ సాధ్యం కాదని అంబేడ్కర్ గట్టిగా నమ్మాడని, స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ కంటే ఎక్కువగా భారత సమాజాన్ని ఎవరూ అర్థం చేసుకోలేదని ఆయన అన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక పార్లమెంట్, టెంపుల్ ఆఫ్ డెమాక్రసీకి పేరు పెట్టడానికి ఇంతకు మించిన వ్యక్తి లేరు. అందుకే అంబేద్కర్ పేరును పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ తన తీర్మానంలో కోరారు.
కేటీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వాలు మృగ్యమయ్యాయని, ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈడీ, ఐటీ దాడులతో భయపెడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. దేశంలో ప్రజల మధ్య విద్వేష పరిస్థితులను సృష్టిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో అంబేడ్కర్ లాంటి వారి అవసరం నేడెంతైనా ఉందని భట్టి అన్నారు.ఈ పరిస్థితుల్లో నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని ఆయన తెలిపారు.