Telugu Global
Telangana

గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపై చర్చించనున్న తెలంగాణ అసెంబ్లీ!

తెలంగాణ అసెంబ్లీ, మండలి గతేడాది సెప్టెంబర్‌లో ఏడు బిల్లులపై చర్చించి పాస్ చేసిన అనంతరం గవర్నర్ వద్దకు పంపింది. కానీ ఎన్ని వారాలు గడిచినా బిల్లులను మాత్రం గవర్నర్ ఆమోదించలేదు.

గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపై చర్చించనున్న తెలంగాణ అసెంబ్లీ!
X

గవర్నర్ తమిళిసై, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఉన్న విభేదాలపై ఇటీవల హైకోర్టు వేదికగా రాజీ కుదిరిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాలకు అనుమతి కోరితే గవర్నర్ జాప్యం చేయడంతో ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. అయితే, కోర్టులో విచారణ జరగక ముందే ఈ సారి గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. రాజ్‌భవన్‌కు ప్రభుత్వానికి మధ్య ఉన్న అంతరం తొలగిపోయిందని అందరూ భావించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులకు కూడా మోక్షం కలుగుతుందని అంచనా వేశారు.

తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ గతేడాది సెప్టెంబర్‌లో ఏడు బిల్లులపై చర్చించి పాస్ చేసిన అనంతరం గవర్నర్ వద్దకు పంపింది. కానీ ఎన్ని వారాలు గడిచినా బిల్లులను మాత్రం గవర్నర్ ఆమోదించలేదు. ఈ క్రమంలో ఒక సారి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ దూతగా వెళ్లి బిల్లులను ఆమోదించాల్సిందిగా గవర్నర్ తమిళిసైని కోరారు. కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఇప్పుడు రాజీ కుదిరింది కదా.. బిల్లులును ఆమోదిస్తారనుకుంటే రాజ్‌భవన్ నుంచి ఆ దిశగా ఎలాంటి స్పందన లేదు.

తాజాగా ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో ప్రధానంగా పెండింగ్ బిల్లులపైనే చర్చ జరిగింది. బిల్లులు చట్టరూపం దాల్చకపోవడంతో పాలన పరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రులు కూడా అభిప్రాయపడ్డారు. దీంతో ఈ నెల 8 వరకు బిల్లులు ఆమోదం పొందుతాయేమో వేచి చూద్దామని.. అప్పటికీ గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోతే అసెంబ్లీలో చర్చిద్దామని సీఎం కేసీఆర్ చెప్పినట్లు ప్రభుత్వం వర్గాలు అంటున్నాయి.

గతేడాది సెప్టెంబర్ 14న ఎనిమిది బిల్లులను తెలంగాణ అసెంబ్లీ, మండలి పాస్ చేసింది. ఇందులో రాష్ట్రంలోని 15 యూనివర్సిటీల్లో నియామకాల కోసం కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేసే బిల్లు కూడా ఉంది. ఈ యూనివర్సిటీలకు గవర్నరే ఛాన్సలర్‌గా ఉండటం గమనార్హం. ఆనాడు పాస్ చేసిన ఏడు బిల్లులలో కేవలం తెలంగాణ జీఎస్టీ అమెండ్‌మెంట్ బిల్ 2022కు మాత్రమే గవర్నర్ ఆమెదం తెలిపారు. మిగతా ఏడు మాత్రం అలాగే పెండింగ్‌లో ఉన్నాయి.

గవర్నర్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్న ఏడు బిల్లులు ఏంటంటే..

1. యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీ బిల్

2. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (టెర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజ్) అమెండ్‌మెంట్ బిల్

3. ది మున్సిపల్ లా (అమెండ్‌మెంట్) బిల్

4. ది పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ సూపరాన్యుయేషన్)(అమెండ్‌మెంట్) బిల్

5. ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్

6. ది మోటర్ వెహికిల్స్ ట్యాక్సేషన్ (అమెండ్‌మెంట్) బిల్

7. తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) అమెండ్‌మెంట్స్ బిల్ 2022

ఈ పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో చాలా ముఖ్యమైన మూడు బిల్లులను వెంటనే ఆమోదించాలని కూడా గవర్నర్‌పై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బిల్, మున్సిపల్ లా బిల్, ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులు త్వరగా ఆమోదం పొందాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు. ఈ పెండింగ్ బిల్లులపై ఫిబ్రవరి 8 తర్వత చర్చ చేసి.. దానికి సంబంధించిన తీర్మానాన్ని గవర్నర్‌కు పంపడం ద్వారా ఒత్తిడి చేయవచ్చని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

First Published:  6 Feb 2023 8:03 AM IST
Next Story