Telugu Global
Telangana

గాలేరు-నగరి,తెలుగు గంగ‌ పనులను ఏపీ చేపట్టకుండా ఆపాలి -కేఆర్‌ఎంబీని కోరిన తెలంగాణ‌

ఈ రెండు ప్రాజెక్టుల పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టకుండా ఆపాలని తెలంగాణ ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సీ మురళీధర్ KRMBకి లేఖ రాశారు. ఈ పనులకు జనవరి 23న ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని, వెంటనే ఆ ప్రక్రియను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని బోర్డు చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.

గాలేరు-నగరి,తెలుగు గంగ‌ పనులను ఏపీ చేపట్టకుండా ఆపాలి -కేఆర్‌ఎంబీని కోరిన తెలంగాణ‌
X

గాలేరు నగరి సుజల స్రవంతి (GNSS) ప్రాజెక్టు, తెలుగు గంగ ప్రాజెక్టు (TGP) పనులను చేపట్టకుండా ఆంధ్రప్రదేశ్‌ను నిరోధించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB)ని కోరింది.

ఈ రెండు ప్రాజెక్టుల పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టకుండా ఆపాలని తెలంగాణ ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సీ మురళీధర్ KRMBకి లేఖ రాశారు. ఈ పనులకు జనవరి 23న ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని, వెంటనే ఆ ప్రక్రియను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని బోర్డు చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. KRMB కొత్త ప్రాజెక్టును చేపట్టకుండా ఏపీని ఆపాలని ఆయన కోరారు.

గాలేరు నగరి సుజల స్రవంతి ప్యాకేజీ 2లో భాగంగా ఏపీ ప్రభుత్వం మెయిన్ కెనాల్ ఎర్త్‌వర్క్‌, వామికొండ సాగర్‌ రిజర్వాయర్‌, సర్వరాయ సాగర్‌ రిజర్వాయర్‌ల ఎత్తిపోతల పటిష్టత, కాల్వలతో సహా డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి టెండర్లు పిలిచిందని మురళీధర్ తెలిపారు. ఈ పనులు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం రూ.130 కోట్లు కేటాయించిందని తెలిపారు.

శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ (SRMC) క్రాస్ రెగ్యులేటర్, బనకాచార్య, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ల ద్వారా 34 టిఎంసిల నీటిని డ్రా చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి అనుమతి ఉందని, అందులో 19 టిఎంసిలను SRMC, 15 టిఎంసిలను చెన్నై నగర తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉందన్నారు.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014కు విరుద్ధమైన తెలుగు గంగ ప్రాజెక్టు ప్రధాన ఛానెల్‌పై ఏపీ రెండు లిఫ్టుల నిర్మాణాన్ని చేపడుతున్నదని మురళీధర్ తెలిపారు. ఏపీ చేపడుతున్న ఈ విస్తరణ పనులతో తెలంగాణలోని కృష్ణా బేసిన్ లోని కరువు, ఫ్లోరైడ్‌ ప్రాంతాల‌ ఆయకట్టులకు, హైదరాబాద్‌ నగరానికి తాగునీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆయన అన్నారు.

First Published:  5 Feb 2023 9:26 PM IST
Next Story