Telugu Global
Telangana

యూనివర్సిటీలపై నమ్మకం తగ్గుతుంది..మళ్లీ విశ్వాసం పెంచాలి : సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ తో పాటు అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు.

యూనివర్సిటీలపై నమ్మకం తగ్గుతుంది..మళ్లీ విశ్వాసం పెంచాలి :  సీఎం రేవంత్‌రెడ్డి
X

రాష్ట్రంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ తో పాటు అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్ వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణలో యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఉన్నత విద్యకు సంబంధించి గడిచిన పదేండ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి అన్నారు. కొంతకాలంగా యూనివర్సిటీలపై విద్యార్థులకు విశ్వాసం తగ్గుతోందని, మళ్లీ నమ్మకం పెంచేలా పనిచేయాలన్నారు. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో స్టడీ చేయాలని వీసీలకు సీఎం సూచించారు. యూనివర్సిటీల్లో ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అధ్యయనం కోసం అవసరమైతే కన్సల్టెన్సీలను నియమించుకొని నివేదిక తయారు చేసుకోవాలన్నారు.

రాజకీయ ఒత్తిళ్ల ప్రభావంతో వీసీలను నియమించలేదని.. ప్రతిభ, సామాజిక సమీకరణలనే పరిగణనలోకి తీసుకున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. వీసీలు బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని.. తప్పులు చేస్తే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని సీఎంహెచ్చరించారు. మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్లకి స్వేచ్ఛ.. ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. గతంలో వీసీలను విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తు పెట్టుకునే వారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సీఎం అన్నారు. విశ్వవిద్యాలయాల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై దృష్టి పెట్టాలని.. విద్యార్థులను గమనిస్తూ అవసరమైన వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. బాలకృష్ణా రెడ్డి, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంతో పాటు ఆయా వర్సిటీలకు కొత్తగా నియమితులైన వైస్ చాన్సలర్లు ప్రొ. ఎం. కుమార్ (ఉస్మానియా) తదితరులు పాల్గోన్నారు.

First Published:  2 Nov 2024 4:00 PM IST
Next Story